లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమికి గురైన కాంగ్రెస్ పార్టీకి.. ఫలితాలకు బాధ్యత వహిస్తూ సీనియర్ నేతలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నో అశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ కేవలం ఒకే ఒక్కస్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితాల అనంతరం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్ బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్ చహర్ చేతిలో దారుణ ఓటమిని చవిచూశారు. కాగా 80 లోక్‌సభ స్థానాల్లో యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకేఒక స్థానంలో గెలుపొందింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో మాత్రమే విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 51 స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment