జైపూర్ : బీజేపీలోలాగా తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తమ నాయకులంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటారని రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు. ఆదివారం రాజసమండ్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి వసుంధర రాజేకి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల‍్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. అమిత్ షా పాల్గొన్న మీటింగ్‌లో వసుంధర రాజె పాల్గొనరని, ఆమె పాల్గొన్న సభలో అమిత్ షా పాల్గొనరని విమర్శించారు. ఆయన వస్తే.. ఆమె వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.
ఇక రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ప్రతిసారి పశ్చిమ బెంగాల్, అస్సాం, కశ్మీర్ రాష్ట్రాల గురించే మాట్లాడుతారు కానీ, రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ప్రస్తావించరని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదనడానికి అమిత్ షా ప్రసంగాలే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ఉద్యోగులు ధర్నాకి దిగినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. సులభంగా రైతులకు రుణాలు అందేలా చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయని వసుంధర రాజే ప్రభుత్వాన్ని గద్దె దింపి తమకు అవకాశం కల్పించాలని సచిన్ ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment