రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్‌కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు.
రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు.
బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్
ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment