అనివార్యతే వారిని ఏకం చేసిందా..?  | Bypoll: Gehlot And Pilot Attend Rallies As Congress Plays Unity Card | Sakshi
Sakshi News home page

అనివార్యతే వారిని ఏకం చేసిందా..? 

Published Thu, Apr 1 2021 2:06 AM | Last Updated on Thu, Apr 1 2021 8:03 AM

Bypoll: Gehlot And Pilot Attend Rallies As Congress Plays Unity Card - Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలకు అడ్డాగా మారిన రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉప ఎన్నికలు కాస్త మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే మార్పు అనేది కేవలం అధికార కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే పరిమితమైందని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మూడు స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు మంగళవారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న మనస్పర్థలను సీఎం అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌లు పక్కనబెట్టి ఒకే వేదికపై కలిసి ఉన్నారనే సంఘీభావ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ చేసింది.

అయితే అజయ్‌ మాకెన్‌ అనేక ప్రయత్నాల తర్వాత అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కానీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతను సచిన్‌ పైలట్‌ మద్దతుదారులకు అశోక్‌ గహ్లోత్‌ అప్పగించలేదు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోని రెండు స్థానాల్లో గుజ్జర్లు కీలకంగా ఉండడంతో పైలట్‌ను తమతో కలుపుకోవడం సీఎం గహ్లోత్‌తో పాటు పార్టీకి అనివార్యంగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనంతరం కొత్త తలనొప్పి మొదలైంది. సహదా, రాజ్‌సమండ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈ కారణంగా కాంగ్రెస్‌ పార్టీ కాస్త నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.   

మరోసారి బయటపడ్డ కమలదళ అంతర్గత కలహాలు 
విపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానే అని అనుయాయులతో ప్రకటింపచేసుకున్న వసుంధరా రాజేను రాష్ట్ర పార్టీలో పట్టించుకొనే నాథుడే కరువయ్యాడనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేను ఐదవ స్థానానికి నెట్టేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్‌ అరుణ్‌ సింగ్‌ మొదటి స్థానంలో ఉండగా, కో–ఇంఛార్జ్‌ భారతి బెన్‌ను రెండవ స్థానంలో ఉంచారు.

రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పునియా 3వ స్థానంలో, ప్రతిపక్ష నాయకుడు గులాబ్‌ చంద్‌ కటారియా నాలుగో స్థానంలో నిలిచారు. ముగ్గురు కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెఖావత్, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్, కైలాష్‌ చౌదరిలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా చేర్చారు. మొత్తం 30 మంది నాయకుల జాబితాలో వసుంధర మద్దతుదారుల్లో కేవలం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్‌ పర్నామి పేరు చేర్చారు. కానీ వసుంధరా రాజేను తీవ్రంగా వ్యతిరేకించే ప్రత్యర్థులను పలువురిని క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. వీరిలో పార్టీ జాతీయ కార్యదర్శి అల్కా గుర్జర్, రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్‌ మీనా, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్, మదన్‌ దిలావర్, జోగేశ్వర్‌ గార్గ్‌లు ఉన్నారు.

ప్రచారానికి నో ఛాన్స్‌ 
మంగళవారం మూడు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన తరువాత వసుంధరా రాజే ప్రత్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి హాజరుకాలేదు. అయితే ఆ సమావేశంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల్లో పార్టీకి సంబంధించిన 10 మంది నాయకుల ఫోటోలు ఉంచినప్పటికీ, వసుంధరా రాజే ఫోటోను చేర్చలేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా పార్టీ కేంద్ర నాయకత్వం ఆమెపై శీతకన్ను వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పలువురు నాయకులను ప్రచారం కోసం పంపించినప్పటికీ రాజేను కావాలనే పక్కనపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల నుంచి దాదాపు దూరం పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న వసుంధరా రాజే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఏ ఒక్క నిర్ణయాన్ని, చర్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.సతీష్‌ పూనియా, ఆయన మద్దతుదారులు వదులుకోవట్లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement