సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రజాసేవకులపై ఆరు నెలలపాటు విచారణ జరపకుండా రక్షణ కల్పిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది' అని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు. 'తమ అవినీతి బాగోతాలకు అండగా ఉండే ప్రజా సేవకులను రక్షించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని పైలట్ మండిపడ్డారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో వసుంధరారాజే ప్రభుత్వం తాజాగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం 180 రోజులపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలకులపై విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదు. సదరు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా మీడియా కథనాలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ మేరకు మీడియాపై సైతం ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించారు. రాజే సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment