జైపూర్: అనర్హత నోటీసులకు సంబంధించి రాజస్తాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గం 18 మంది ఎమ్మెల్యేలకు మంగళవారం హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పునిస్తామని, అప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి హైకోర్టు సూచించింది. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తా ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. శుక్రవారంలోగా తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఇరు వర్గాలను ఆదేశించింది.
అయితే, ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు తుది తీర్పును ప్రకటిస్తుందా? లేక మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు, తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై మాటల దాడిని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొనసాగించారు. పార్టీని మోసం చేసిన వారు ప్రజలకు ముఖం చూపించలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిసినా.. తన విశ్వాసం సడలలేదని, ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటానన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌తో అంతా పోరాడుతున్న సమయంలో.. పీసీసీ చీఫ్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. దీన్ని సహించబోం’ అని పైలట్ పేరెత్తకుండా మంగళవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఆరోపణలు గుప్పించారు.
వారం రోజుల వ్యవధిలో సీఎల్పీ భేటీ జరగడం ఇది మూడోసారి. జైపూర్ శివార్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిది చేసిన హోటల్‌లోనే ఈ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణ్‌దీప్ సూర్జేవాలా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎల్పీ భేటీ అనంతరం సీఎం గహ్లోత్ నివాసంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు.. తదితరాలపై కేబినెట్ భేటీలో చర్చించారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment