ఆదివారం సూరత్‌లో పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజ్‌పుత్‌లు
అహ్మదాబాద్ : సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌పుత్‌లు భారీ ఆందోళనలు నిర్వహించారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్ లో ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లా వుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమ గీతాన్ని చిత్రీ కరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్ భాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. ముంబైలోని భనాల్సీ కార్యాలయం ముందు 25 మంది రాజపుత్ర వర్గీయులు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిని విడిచిపెట్టారు. చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి పద్మావతి చిత్రానికి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత భన్సాలీపై దాడికి దిగిన దుండగులు..తర్వాత కొల్హాపూర్‌లో వేసిన కోట్లాది రూపాయల విలువైన సినిమా సెట్‌ను సైతం తగలబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment