Rapaka Varaprasad: జనసేన పార్టీకి నాకు మధ్య కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉంది - Sakshi
Sakshi News home page

పవన్‌కి నాకు మధ్యలో అడ్డంకి ఉంది : రాపాక

Published Wed, Dec 11 2019 2:27 PM | Last Updated on Thu, Dec 12 2019 11:13 AM

Rapaka Vara Prasad Says Gap Between Me And Janasena - Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కి, తనకు మధ్యలో అడ్డంకి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. తమ మధ్య అడ్డంకి తొలుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాపాక ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసనని అన్నారు. చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు. 

జనసేన పార్టీకి తనకు మధ్య కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని.. దానిని సరిచేసుకుంటానని రాపాక తెలిపారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తను కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. కాగా,  రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  

చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : మేరుగ
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. స్పీకర్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే చంద్రబాబు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడే విధంగా ఉన్నాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్‌ తీసుకున్న ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను అమలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు చేస్తున్న కుయుక్తుల్ని ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. 

చంద్రబాబును సస్పెండ్‌ చేయాలి : మధుసూదన్‌ యాదవ్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ తెలిపారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకించటం బాధకరమని అన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టే టీడీపీ సభ్యులు చైర్‌ను అగౌరవపరిచేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చంద్రబాబును సభలో నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దారుణం అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే చంద్రబాబు ఎందుకంత చులకన భావమని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement