
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సమావేశమైన కీలక నేతలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి అభ్యర్థుల పోటాపోటీ ప్రతిపాదనలు రావడంతో అభ్యర్థి ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాలపై అభ్యర్థుల పేర్లు కొలిక్కివచ్చినా.. పలు నియోజకవర్గల్లో చిక్కుముడి వీడడంలేదు. టిక్కెట్ దక్కదని భావిస్తున్న అసంతృప్తి నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్ వద్ద ధర్నాకు దిగారు.
నల్గొండ జిల్లా దేవరకొండ టికెట్ తనకే కేటాయించాలని రవీంద్రనాయక్ తన మద్దతుదారుతో ధర్నా చేశారు. చర్చజరగుతున్న సమయంలోనే స్కీృనింగ్ కమిటీ సమావేశం వద్ద ఆయన నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగిన టీకాంగ్రెస్ నేతలు రవీంద్రనాయక్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.