తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది.అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ప్రకటించిన ఏడింట్లో అప్పుడే రెండుచోట్ల రెబల్స్‌పుట్టుకొచ్చారు. అందులో ఒకచోట అప్పుడే నామినేషన్‌కూడా వేసేశారు. ఇంకా ప్రకటించాల్సిన రెండింటి విషయంలోనూ వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.అక్కడ కూడా రెబల్స్‌కు అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఇన్ని వివాదాలు తలెత్తితే... ఇక ముందు ముందు ఎలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటాయోనన్నసందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో నామినేషన్‌ల పర్వం రెబల్స్‌తో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలోనే తడబడుతున్న అధికార పార్టీ ఇప్పటికీ జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గానికి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేకపోతోంది. నాదంటే నాదేనంటూ సీటు కోసం ఈ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నా వారికి అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో తాము వద్దన్న వారికే మరలా టిక్కెట్టు ఇవ్వడంపై తీవ్ర మనస్థాపానికి గురైన టీడీపీ అసంతృప్త నేతలు రెబల్స్‌గా మారుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది.
చీపురుపల్లిలో రెబల్‌గా త్రిమూర్తులురాజు
చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరాజు సోమవారం రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. త్రిమూర్తులు ఏపీజీవీబీ మేనేజర్, ఆ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో బొత్స సత్యనారాయణపై గద్దె బాబూరావు ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ మృణాళికి పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఇలాగే రెబల్‌గా నామినేషన్ వేశారు.
కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అశోక్‌గజపతిరాజు బుజ్జగించి నామినేషన్ వెనక్కుతీసుకునేలా చేశారు. తీరా అశోక్ ఎంపీ అయిన తర్వాత మాటతప్పి త్రిమూర్తులు రాజును మోసం చేశారు. ఐదేళ్లుగా ఇస్తామన్న ఎమ్మెల్సీగానీ, మరే ఇతర పదవిగానీ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుబట్టారు. చివరి నిమిషం వరకూ పోరాడారు. అయినా మళ్లీ పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో మరలా రెబెల్ అవతారం ఎత్తారు. ఈ పట్టుదల చివరి నిమిషం వరకూ ఉంటుందో... లేక అధిష్టానం ఆదేశాలతో విరమించుకుంటారో చూడాలి. ఈసారి పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం పదవి కోసమే ఈ డ్రామాలనే విషయం జనానికి అర్థమై, ఇప్పటి వరకూ ఆయనపై ఉన్న గౌరవాన్ని కోల్పోవాల్సి ఉంటుందని ఆయన వర్గీయులే అభిప్రాయపడుతున్నారు.
గజపతినగరంలోనూ అదే తీరు...
జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి గజపతినగరం సమస్యాత్మకంగా మారింది. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు వ్యతిరేకంగా అతని సోదరుడు కొండబాబు రెబల్‌గా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్టుపై కూడా అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతోంది. ఇక్కడ కూడా పతివాడ నారాయణస్వామినాయుడు లేదా అతని కుమారుడు అప్పలనాయుడుకు టిక్కెట్టు ఇస్తే టీడీపీలో రెబల్స్ పుట్టుకొచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి.
ప్రశ్నార్థకంగా గీత భవితవ్యం
విజయనగరంలో దాదాపుగా టిక్కెట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించుకున్న అశోక్ గజపతి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అదితిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నానని, ఆమెకు కొత్త గనుక వెనకుండి ప్రచారం చేయాలని గీతను కోరారు. తాను ఉండగా ఇదేమిటని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందనే నమ్మకం ఉందని సమాధానం చెప్పి గీత వెనుదిరిగారు.
విజయనగరం టిక్కెట్ల ఖరారు బాధ్యతను అశోక్‌కే చంద్రబాబు అప్పగించినందున ఆయన తన కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేగాదు పార్టీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా తన కుమార్తె నామినేషన్ వేసే తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌గా పోటీలో నిలబడాలని గీత వర్గీయులు పట్టుబడుతున్నారు. ఆమె కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనూ సంప్రదింపులు జరుపుతున్నటికీ టీడీపీతో తెరవెనుక పొత్తుల నేపధ్యంలో అశోక్ కుమార్తెకు వ్యతిరేకంగా గీతకు జనసేన టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment