ఓటమి భయంతో రెండు నాల్కలు | Fearing Defeat TDP Leader Chandrababu Has A Two-Tongued Attitude | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో రెండు నాల్కలు

Published Wed, Sep 14 2022 12:47 AM | Last Updated on Wed, Sep 14 2022 12:47 AM

Fearing Defeat TDP Leader Chandrababu Has A Two-Tongued Attitude - Sakshi

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాటలను వింటే, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియడం లేదని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. జగన్‌ ప్రభుత్వంపై పోరాడమంటారు, కానీ ఎందుకు పోరాడాలో చెప్పరు. సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ నాశనం అయిందంటారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ అమలు చేస్తానని చెబుతారు. రాష్ట్ర పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టామని చెబుతూనే, వస్తున్న పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత ఆయన చేతులెత్తేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ దాన్ని బహిరంగంగా ఒప్పుకోలేరు. అందుకే దేన్ని విమర్శిస్తున్నారో కూడా ఆయనకు స్పష్టత లేకుండా పోయింది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రకటనలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన ఒక ప్రసంగం చూస్తే... ఇదేమిటి? చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిచే అవకాశం లేదా అని ఆ పార్టీ కార్యకర్తలకే అనుమానం వస్తుంది. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా, లోపల చంద్రబాబు నాయుడులోని గుబులు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై పోరాడాలని ఆయన అంటారు. అంతవరకు తప్పు లేదు. కానీ ఎందుకు పోరాడాలి అన్నదానిపై ఆయనకే క్లారిటీ లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ నాశనం అయిపోయిందని అంటారు. కానీ వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తాను అమలు చేస్తాననీ, వాటికి రెట్టింపు ఇస్తాననీ ఆయన చెబుతారు. దీనిని ఎవరైనా నమ్ముతారా? 

అంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏడాదికి తల్లులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు. మరి తాను ముప్పై వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతారా? అంటే ఆ మాట చెప్పరు. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని ఆరోపించారు కదా? మరి చంద్రబాబు నాయుడు ఎలా రెట్టింపు పథకాలు ఇస్తారన్న ఆలోచన కాస్త విజ్ఞత ఉన్నవారికి ఎవరి కైనా వస్తుంది. అలాంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాదా? అంటే దాని అర్థం అటు జగన్‌ ప్రభుత్వ పథకాలను కాదనలేకా, ఇటు అవుననలేకా ఆయన సతమతమవుతూ, తన సహజ లక్షణం ప్రకారం డబుల్‌ టాక్‌ చేస్తున్నారన్నమాట!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాశనం అని చెప్పడం ప్రతిపక్షాలకు ఒక ఫ్యాషన్‌ అయింది. ఏ విధంగా నాశనం అయింది? జగన్‌ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేయడం వల్లా? మరేదైనా కారణమా? అన్నదానిపై ఒక్క విపక్ష నేత కూడా ఇంతవరకూ మాట్లాడలేక పోయారు. కేవలం ద్వేషంతో ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. 
పోలీసులు లేకుండా వస్తే వైసీపీనో, టీడీపీనో తేల్చుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటి దీని అర్థం? నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం కలిగిన వృద్ధనేత ఈ మాటలు అనడం సరైనదేనా? ఇది సాధ్యమేనా? ఆయన తన చుట్టూ ఉన్న ఎస్పీజీ సెక్యూరిటీ వంద మందిని పక్కనబెట్టి ఎక్కడైనా తిరుగుతున్నారా? తాను సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాననీ, రోడ్డు మీద తేల్చు కుందామనీ అనగలరా? అలా చెప్పరు. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం రోడ్ల మీదకు వెళ్లి తన్నుకు చావాలన్నమాట. తమ పోరాటాల ద్వారా పోలీసులతో కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలట. అవసరమైతే కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన వెనుకాడరట. ఇది ఏమైనా పద్ధతేనా? కోర్టులలోనే కేసులు గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు ఎన్నికలలో మరెన్ని కోట్లు వ్యయం చేస్తారన్న ప్రశ్న వస్తే ఆయన సమాధానం ఇస్తారా? చంద్ర బాబు చివరికి కేసులు, కోర్టుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారన్నమాట! చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి నిజం గానే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి పిచ్చిపిచ్చి చేష్టలకు పాల్పడితే నష్టపోయేది వారే. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ సురక్షితమైన కోట వంటి ఇళ్లలో, వందల మంది భద్రత మధ్య నివసిస్తుంటారు. ఆయనకేమీ కాదు. కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి పనిచేయాలని చెప్పవచ్చు. కానీ పరోక్షంగా గొడవలు చేసి కేసులు పెట్టించుకోవాలని ఆయన చెబుతుంటే తెలివైన కార్యకర్త ఎవరైనా అందుకు సిద్ధపడతారా?

ఎన్నికలు త్వరగా వస్తే పీడ పోతుందట. అంటే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించి ప్రజలు పీడ వదిలించుకున్నారని చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు వస్తోందట. ఇలాంటి మాటలు ఎవరికి వర్తిస్తాయి? అన్ని ఎన్నికలలోనూ పరాజయం చెందినవారికీ, పరా భవం పొందినవారికి కదా భయం కలగలవలసింది? చంద్రబాబు తాను భయపడుతున్న విషయాన్ని బహిర్గతం కాకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుప్పంలోనే స్థానిక ఎన్నిక లన్నిటిలో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి భయపడుతుండడం వల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థంకావడం లేదా? 

మరో సందర్భంలో తనకు తెలియకుండానే చంద్రబాబు ఒక వాస్తవం ఒప్పుకున్నారు. ఇంతవరకూ జరిగిన రాజకీయం ఒక ఎత్తు... ఇకపై మరో ఎత్తు అని అన్నారు. చంద్రబాబు ఇది అనుభవ పూర్వకంగానే చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి చేదు ఫలితాలను ఆయన ఎన్నడూ చూడలేదు. అందుకే దుర్మార్గుడిని ఎదుర్కునే శక్తి మనకు ఉంటేనే నిలబడగలుగుతాం అనీ, యోధుల్లా పోరాడుతున్న కార్యకర్తలను నాయకులు కడుపులో పెట్టుకుని కాపా డాలనీ ఆయన కోరుతున్నారు. కార్యకర్తలు యుద్ధానికి సన్నద్ధం కావాలట. ఎవరిపై యుద్ధం చేస్తారు? అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌ ఏ రకంగా దుర్మార్గుడు అవుతారు? చెప్పిన హామీలను వేటినీ అమలు చేయని చంద్రబాబు కదా దుర్మార్గుడు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సందేహం రాదా? 

రాష్ట్రం పునర్మిర్మాణంపైనే దృష్టి నిలిపామనీ, పొత్తులపై తానెప్పుడూ మాట్లాడలేదనీ చంద్రబాబు అంటున్నారు. పొత్తులు కూడా అవసరాన్ని బట్టి సమయానుకూలంగా నిర్ణయం చేద్దామని ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడమా? ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు లేకుండా కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లడమా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వ వద్దని లేఖలు రాయడమా? 

రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉండవచ్చు. కానీ దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఈ విషయంలో చంద్రబాబు మాట మార్చి నంతగా దేశంలో ఇంకెవరూ మార్చలేరేమో. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలను ఆయన ఎన్నిసార్లు దూషించారు? అయినా మళ్లీ వాటితో పొత్తు పెట్టుకున్నారు. జనసేన పార్టీతో తాము వన్‌ సైడ్‌ లవ్‌ చేస్తున్నామని ఎందుకు బాధపడిపోయారు? ఇప్పుడు సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి, సమయాను కూలంగా పొత్తులు పెట్టుకుందామని చెప్పగలిగారంటే అది ఆయనకే చెల్లింది. ఇంత చెప్పినా తెలుగుదేశం పార్టీ నాయకులలో అంత విశ్వాసం రావడం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. పార్టీ నేతలు బద్దకం వీడాలనీ, ప్రజలలోకి వెళ్లాలనీ, పని చేయాలనీ పదే పదే కోరారు. ఇంతవరకు తప్పులేదు. కాకపోతే తాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తానని చెప్పాననీ, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలనీ చంద్రబాబు చెబుతున్నారు. దీని అర్థం ఏమిటి? తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో కూడా అధికారం సాధించలేకపోతే, తాను అసెంబ్లీకి గెలిచినా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన దయనీయంగా పార్టీ కార్యకర్తలకు వివరి స్తున్నారా? మళ్లీ గెలవలేమేమో అన్న భయం, సందేహాల మధ్య చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్న సంగతి మామూలు వ్యక్తులకు కూడా అర్థం అవుతుంది. అలాంటిది చంద్రబాబును దగ్గరగా చూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కాదా?

కొమ్మినేని శ్రీనివాసరావు (వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement