కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీని 22న సీల్డ్ కవర్‌లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు స్పష్టం చేస్తూ... విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
స్వామిగౌడ్‌ను గాయపర్చినందుకు కాదు..
కోమటిరెడ్డి, సంపత్‌లు తమను శాసనసభ నుంచి బహిష్కరించడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పిటిషనర్ల వాదనలు పూర్తవగా.. సోమవారం ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శుల తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను బహిష్కరించలేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా.. సభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందునే తీర్మానం ప్రవేశపెట్టి వారిని బహిష్కరించారు. ఇది సభ నిర్ణయమే తప్ప.. స్పీకర్‌ది కాదు. సభ నిర్ణయం మేరకు స్పీకర్ వ్యవహరించారు. సభ లోపల, వెలుపల ఎక్కడ సభ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినా సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఆ అధికారం మేరకే స్పీకర్ చర్యలు తీసుకున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం సరికాదు. పిటిషనర్లు ఎక్కడా సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించలేదని చెప్పలేదు. ఇయర్ ఫోన్ విసిరిన దానికి ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు..’’అని కోర్టుకు విన్నవించారు. సభలో సభ్యుల ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని వివరించారు. ఇక బహిష్కరణ తీర్మానాన్ని పిటిషనర్లు సవాలు చేయలేదని, అందువల్ల తీర్మానం అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు విన్నవించారు.
ఆరు వారాల పాటు చర్యలు వద్దు..
ఇక వీడియో ఫుటేజీ అంశంపై అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిర్దిష్టంగా గవర్నర్ ప్రసంగం సందర్భానికి సంబంధించిన ఫుటేజీని అడుగుతున్నారని, తమ వద్ద ఏ ఫుటేజీ ఉంటే అదే ఇస్తామని కోర్టుకు చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఆరు కెమెరాలు పనిచేస్తాయని, అందులో రెండు పూర్తిస్థాయిలో గవర్నర్ ప్రసంగించే వేదికను ఫోకస్ చేసి ఉంటే, మిగతావి సభ్యులను ఫోకస్ చేసి ఉంటాయని వివరించారు. ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపర్చడమే పిటిషనర్లను బహిష్కరించడానికి కారణంగా పేర్కొంటున్న నేపథ్యంలోనే.. తాము నిర్దిష్టంగా గవర్నర్ వేదికను ఫోకస్ చేసిన కెమెరాల ఫుటేజీని కోరుతున్నామన్నారు. దీంతో అందుబాటులో ఉన్న మొత్తం వీడియో ఫుటేజీని సమర్పించేందుకు ఏజీ అంగీకరించారు. ఇక నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేసిన అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ భజరంగ్ బహదూర్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
ఉత్తర్వులపై కాంగ్రెస్ నేతల హర్షం
సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక రీతిలో నిబంధనలకు విరుద్ధంగా తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌పై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని కాంగ్రెస్ నేతలు అన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లురవిలతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినా న్యాయ స్థానాలపై తమకు విశ్వాసం ఉందని సంపత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment