తిరువనంతపురం: కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించారు కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్. పేదరికంలో పుట్టి దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంట్ వరకు ఎదగగలిగారంటే మామూలు విషయం కాదు. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి రమ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు రమ్య పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒక సాధారణ దినసరి కార్మికుడి కూతురు కమ్యూనిస్ట్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు రాష్ట్ర నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ రమ్యనే కావడం విశేషం. 32 ఏళ్ల దళిత ఎంపీ అయిన రమ్య.. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ పేదలకు సేవ చేస్తానంటోన్నారు. పేదరికం, నిరుద్యోగం, మహిళల సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడుతానని అంటున్నారు.
2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యువ నాయకత్వం కోసం సాగించిన వెతుకులాటలో స్థానిక దళిత సామాజిక వర్గానికి చెందిన 32 ఏళ్ల రమ్య హరిదాస్ రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు. మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన, సృజనాత్మకత దళితుల అభివృద్ధి అంశాలపై మంచి పట్టు కలిగిన రమ్యని రాహుల్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో పార్టీ ఆమెకు అవకాశం కల్పించింది.
రోజుకూలీ కుటుంబంలో పుట్టి..
రమ్య రోజు కూలీ చేసుకుని బతికే దళిత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి హరిదాస్ కోజికోడ్ జిల్లాలోని కున్నామంగళమ్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలైన తల్లి రాధ స్ఫూర్తితో ఆమె అడుగుజాడల్లో రమ్య అతి చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రారంభించారు. మొట్టమొదట కేరళ కాంగ్రెస్ విద్యార్థి సంఘంలోనూ, ఆపై యువజన కాంగ్రెస్‌లోనూ గత పదేళ్లుగా చురుకైన కార్యకర్తగా పనిచేసిన రమ్య 2010లో కోజికోడ్ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది యువతని ఎంపిక చేసి వారికి విదేశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మన దేశం నుంచి జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో జరిగిన వరల్డ్ యూత్ కార్యక్రమాలకి వెళ్లిన పది మంది ప్రతినిధుల్లో రమ్య ఒకరు. కున్నమంగళం పంచాయతీకి ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా ఆదివాసీలు, దళితుల సమస్యలపై అవగాహనను పెంచుకుని, ప్రస్తుతం వివిధ అంశాలపై శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు.
కొండను ఢీకొట్టారు.
స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తోన్న అనేక మంది సీనియర్ నాయకులున్నా పాలక్కాడ్ జిల్లాలోని అలత్తూర్ లోక్‌సభ స్థానానికి రమ్య పేరు తెరపైకి వచ్చింది. మహిళలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితులూ, అలత్తూర్‌లో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడానికి తోడు రమ్య సామాజిక చైతన్యం వెరసి ఆమెకు ఈ అవకాశం వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2009 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతోన్న సీసీఐఎం నేత పీకేబిజూను ఓడించి పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment