సాక్షి, అమరావతి: కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం నేర్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి ముఖ్యకారణాల్లో చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలు, మాయమాటలేననడంలో అతిశయోక్తి లేదు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ తాను ఎన్ని మాయలుచేసినా వారికి గుర్తుండదని, ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు పంచి మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ప్రజలు మర్చిపోలేని షాక్ ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మోసాలకు, వేధింపులకు తాజా ఎన్నికల్లో ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. తమ బాధలు వింటూ, తమకు అండగా ఉండి చివరి వరకు వెన్నంటి నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చారు. చంద్రబాబు చరిత్ర మొత్తం మాయలు, మోసాలేనన్నది జగమెరిగిన సత్యం. వీటికి ప్రతీకారంగానే ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సరైన సమాధానం ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరాజయం ఆపార్టీ చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనూ ఇంతకు ముందెన్నడూ లేదు.
600లకుపైగా హామీలు ఇచ్చి..
2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల అనంతరం వాటిని విస్మరించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, కార్మికులు, వివిధ వృత్తి కార్మికులు, కులాల వారీగా పలు హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీచేస్తామని, డ్వాక్రా, చేనేత రుణాలన్నిటినీ రద్దుచేస్తామని, రైతులు కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి వారి ఇంటికి చేరుస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ (1.42 లక్షలు) భర్తీచేస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, నెలకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగిస్తామని, రైతులకు 9 గంటల నిరాటంక ఉచిత విద్యుత్తు ఇస్తామని, పేదలందరికీ ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామనే లాంటి హామీలు ఇచ్చారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. తొలిసంతకం అంటూ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, బెల్టు షాపుల రద్దు హామీలకు అధికారంలోకి వచ్చిన తొలిరోజునే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అరకొరగా చేసిన రైతు రుణమాఫీ మొత్తం బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. మరోపక్క అక్కచెల్లెమ్మలకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారు. బెల్టుషాపులను పెంచేసి మద్యాన్ని ఏరులై పారించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అధికారం లేదని రిజర్వేషన్లపై పలు కులాలకు హామీ ఇచ్చి చంద్రబాబు వారందరినీ మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాలను కాపీ చేసి వృద్ధాప్య పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రెట్టింపు చేస్తామని ప్రకటించారు.
బాబు మోసాలను మరిచిపోలేని ప్రజలు
గతంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకూ చంద్రబాబు తూట్లు పొడిచారని ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. 1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి పథకాలను అమల్లోకి తెచ్చారు. వ్యవసాయ విద్యుత్తులో కూడా హార్స్‌పవర్‌కు రూ. 50 వసూలు వంటి నిర్ణయాలు అమలు చేశారు. అయితే చంద్రబాబు 1995లో ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే రూ.2కే కిలో బియ్యం ధరను అమాంతం రూ. 5.25కి పెంచేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన జనతా వస్త్రాల స్కీమునూ చంద్రబాబు ఎత్తేశారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిలువునా తూట్లు పొడిచి దానికీ మంగళం పాడేశారు. పింఛన్లను గ్రామానికి కోటాను నిర్ణయించి ఆమేరకు మాత్రమే ఇచ్చారు. ఎవరైనా కొత్తగా పింఛన్ కావాలని దరఖాస్తు పెట్టుకొంటే జాబితాలోని వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే కానీ కొత్తవారికి పింఛన్ మంజూరు అయ్యేది కాదు. 2014లో అధికారం చేపట్టాక కూడా ఆయన తీరులో మార్పు రాలేదు.
బాబు మోసానికి ప్రతీకారం
Published Fri, May 24 2019 6:24 AM | Last Updated on Fri, May 24 2019 10:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment