హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఒంటరిగానే ఆయన శాసనసభకు వచ్చారు. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముందుగానే అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. దీంతో రేవంత్ ఒక్కరే సభలోకి వెళ్లారు. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్పీ నేత పదవుల నుంచి తొలగించడంతో ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడం, సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై ఈ చర్య తీసుకుంది. కాగా, అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... డ్రగ్స్ కేసు దర్యాప్తుపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మరోవైపు విదేశాల నుంచి తిరిగొచ్చిన చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సమావేశమయ్యారు. ఒంటరిగా చంద్రబాబు ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది.
కాగా, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశమైంది. ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, అరవింద్ కుమార్ గౌడ్, సీతక్క తదితర నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment