కేసీఆర్‌.. చంద్రబాబు నీకెన్నిచ్చాడు: రేవంత్‌ | Revanth Reddy Slams CM KCR | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 12:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Revanth Reddy Slams CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పొత్తు కోసం చంద్రబాబు రూ. 500 కోట్లు కాంగ్రెస్‌కు ఇచ్చాడంటున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌.. తను పొత్తు పెట్టుకున్నప్పుడు ఎంత ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడులు జరిగిన సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) ఇచ్చిన వార్తా కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. గత బుధవారం విచారణకు హాజరైనప్పుడు ఐటీ అధికారుల ఆ కథనాలపైనే ప్రశ్నించారని తెలిపారు. విదేశాల్లో తనకు అకౌంట్స్‌ ఉన్నట్లు ఇచ్చిన తప్పుడు వార్తలపై 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆ సదరు మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. (చదవండి: బుడ్డర్‌ఖాన్లలాగా కత్తులు తిప్పిన్రు)

ప్రభుత్వ రద్దు నాటి నుంచి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ తీరు కల్లు తాగిన కోతికి తేలు కుడితే ఎగిరినట్లు ఉందని విమర్శించారు. యమధర్మారాజు దగ్గరకు పోయి అక్కడ గోలీలు ఆడి మరి వెనక్కు వచ్చి తెలంగాణ తెచ్చినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో 2009 నుంచి 2014 వరకు 3,152 కేసులు పెడితే 1150 కేసులు మాత్రమే ఉపసంహరించుకున్నారని తెలిపారు. అసెంబ్లీలో ఒక్క తీర్మానం ద్వారా అన్ని కేసులు ఎత్తేయవచ్చని,కానీ కేసీఆర్‌ తనకు కావాల్సిన వారిపై మాత్రమే ఉపసంహరించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ విద్యార్థి నేత మున్నూరు రవికి 6 నెలల జైలు శిక్ష పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కేసీఆర్‌ కుటుంబంపై ఉన్న కేసులే తొలగించి మిగిలిన ఉద్యమకారులవి ఎందుకు ఉపసంహరించ లేదో సమాధానం చెప్పాలన్నారు. ఈ కేసుల వల్ల అర్హతలు ఉండి పోటీ పరీక్షల్లో మెరిట్‌ వచ్చినా కూడా విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణని ఎద్దేవా చేశారు. (చదవండి: ఈసీ ప్రెస్‌మీట్‌.. ‘తెలంగాణ’ షెడ్యూల్‌పై ఉత్కంఠ)

కేసీఆర్‌ ఉద్యమం ప్రారంభించాకే ఆయన కేంద్రమంత్రి, సీఎం, ఛానల్‌, పేపర్‌, కోట్ల ఆస్తులు సంపాదించారన్నారు. అలాగే హరీష్‌, కేటీఆర్‌ మంత్రులయ్యారని, కూతురు కవిత ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడయ్యారని విమర్శించారు. ఎన్నికలు కేసీఆర్‌ Vs చంద్రబాబు మధ్య జరుగుతున్నట్లు టార్గెట్‌ చేస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పలేక సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లకు కనీసం తెలంగాణలో ఓటు కూడా లేదని, ఆయన ఇక్కడ పోటీ చేయడని,కానీ తెలుగుదేశం బరాబర్‌ పోటీచేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అంటే భయం కాబట్టే సీఎం పదవిలో ఉన్నామన్న సోయిలేక దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ బాష ఊరిలో బర్లు కాసేవాడు కూడా మాట్లాడటం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఏదోలా మరోసారి గట్టెక్కేలా ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ దుర్బుద్దిని ప్రజల్లో ఎండగడతామన్నారు. (చదవండి: కేసీఆర్‌ ఆ వీడియోలు చూపించు: డీకే అరుణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement