ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్... భారత్‌లో భాగం కాబోతుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొందడానికి దారులు తెరుచుకుని ఉన్నాయని అన్నారు. రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఇళ్లు కొనుక్కోవాలనే, బిజినెస్ చేయాలనే కల నెరవేరబోతుందనే విషయాన్ని రాసిపెట్టుకోండని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘1947కు మందు పాకిస్తాన్ అనేది లేదు.. 1945కు ముందు ప్రజలు దానిని హిందూస్తాన్‌లో భాగంగానే పరిగణించేవారు. అలాంటి పాకిస్తాన్ మళ్లీ 2025 తర్వాత తిరిగి హిందూస్తాన్‌లో భాగం కానుంది. అఖండ భారత్ కల కూడా సాకరమవుతుందనే నమ్మకం కలుగుతోంది. తొలిసారిగా భారత ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై కఠిన వైఖరి తీసుకుంది.. తద్వారా సైన్యానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. తాజాగా కశ్మీర్‌లో పరిస్థితులు మారాయి. ఇకపై లాహోర్‌లో జీవించడానికి.. చైనా అనుమతి తీసుకోకుండా మానసరోవరం వెళ్లడానికి కలలు కనవచ్చ’ని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ భారత్‌లో ఏ విధంగా భాగం కాబోతుందనే విషయాన్ని మాత్రం ఇంద్రేశ్ కుమార్ వ్యక్తపరచలేదు.
Comments
Please login to add a commentAdd a comment