బీజేపీలో చేరడం లేదు! | Sachin Pilot says he is not joining BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరడం లేదు!

Published Thu, Jul 16 2020 3:07 AM | Last Updated on Thu, Jul 16 2020 1:12 PM

Sachin Pilot says he is not joining BJP - Sakshi

జైపూర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌ రాజకీయం ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా  సాగుతోంది. సీనియర్‌ సీఎం గహ్లోత్, యువ తిరుగుబాటు నేత పైలట్‌ల మధ్య రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ పదవుల నుంచి తొలగించినప్పటికీ.. బీజేపీలో చేరే ఆలోచన లేదని సచిన్‌ పైలట్‌ బుధవారం తేల్చిచెప్పారు. దాంతో, బీజేపీ ఆతిథ్యాన్ని స్వీకరించడం మాని సొంత గూటికి తిరిగి రావాలని పైలట్‌కు  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా సూచించారు. ఒకవైపు, పార్టీ గూటికి తిరిగిరావాలని కోరుతూనే.. మరోవైపు, పైలట్, ఆయన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థించింది.

దాంతో స్పీకర్‌ సీపీ జోషి ఆ 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని, పార్టీని వీడి వెళ్లాలనుకునేవారు వెళ్లవచ్చని, నవ యువనేతలకు కాంగ్రెస్‌ పార్టీలో ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, వాటిని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. పెలట్‌పై విమర్శల వాడి పెంచారు సీఎం గహ్లోత్‌. అందంగా ఉండి, మీడియాతో ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడితే సరిపోదని, దేశం కోసం ఏం చేశామని కూడా ఆలోచించాలని పైలట్‌కు చురకలంటించారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని స్వయంగా సచిన్‌ పైలటే పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు
పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి స్పీకర్‌ సీపీ జోషీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పును పేర్కొంటూ, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న నిబంధనల మేరకు వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగా ఇటీవలి శాసనసభాపక్ష భేటీలకు హాజరు కాలేదని అందులో వివరించారు. దాంతో, శుక్రవారంలోగా స్పందించాలని కోరుతూ స్పీకర్‌ ఆ 19 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు మంగళవారమే జారీ చేశామని స్పీకర్‌ వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో జరిగిన శాసనసభా పక్ష భేటీకి ఈ 19 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే.

నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర: పైలట్‌
బీజేపీలో తాను చేరబోవడం లేదని బుధవారం సచిన్‌ పైలట్‌ స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు నేతలు ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం, బీజేపీని ఓడించడం కోసం ఎంతో కష్టపడ్డాను’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ‘పైలట్‌కు పార్టీ తలుపులు ఇంకా మూసుకుపోలేదు. తప్పును తెలుసుకుని, బీజేపీ మాయ నుంచి బయటకు వచ్చే జ్ఞానం అతనికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నా’ అని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అవినాశ్‌ పాండే ట్వీట్‌ చేశారు.    

బీజేపీ ఆతిథ్యం చాలు.. తిరిగి రా!
బీజేపీలో చేరే ఉద్దేశం లేనట్లయితే.. పార్టీలోకి తిరిగి రావాలని పైలట్‌కు రణ్‌దీప్‌ సూర్జేవాలా సూచించారు. బీజేపీ ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించింది ఇక చాలంటూ వ్యాఖ్యానించారు. ‘రండి.. ఒక కుటుంబంలా కూర్చుని అన్ని అంశాలపై మాట్లాడుకుందాం’ అని పైలట్‌ వర్గ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. గురుగ్రామ్‌లోని హోటళ్లలో ఉన్న ఎమ్మెల్యేలను విడుదల చేయాలని పైలట్‌కు  రణ్‌దీప్‌ సూర్జేవాలా విజ్ఞప్తి చేశారు.

మళ్లీ వస్తే.. ఏమిస్తారో..!
మనసు మార్చుకుని పైలట్‌ మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలం అయినా, ఆయనకు కీలక బాధ్యతలను అధిష్టానం వెంటనే అప్పగించకపోవచ్చని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కనీసం నెల రోజుల పాటైనా పైలట్‌ వేచి చూడాల్సి రావచ్చని  వ్యాఖ్యానించారు. గహ్లోత్‌ ప్రభుత్వం కూలిపోయే ముప్పు స్థాయి చాలా వరకు తగ్గిందని, దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మెజారిటీ మార్క్‌ అయిన 101ని సునాయాసంగా సాధించగలరని చెప్పారు. తానింకా కాంగ్రెస్‌ వాదినేనని పెలట్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో.. పార్టీ హై కమాండ్‌ విశ్వాసం పొందేందుకు ఆయనకు మరి కొంత కాలం పట్టవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

‘అందంగా ఉంటే సరిపోదు’
ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తిరుగుబాటు నేత సచిన్‌పైలట్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతిలో పావులా మారాడని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. పైలట్‌ పేరు ప్రస్తావించకుండా, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు.

యువకుడిగా ఉన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని, ఆ కష్టం పైలట్‌ కూడా పడి ఉంటే దేశానికి మరింత సేవ చేసేవాడని వ్యాఖ్యానిం చారు. ‘అందంగా ఉండటం, మీడియాతో ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడడం సరిపోదు. దేశ సేవ పట్ల, పార్టీ భావజాలం పట్ల నిబద్ధత ఉండాలి’ అన్నారు. యువకుడిగా ఉన్న సమయంలో పడిన కష్టం కారణంగానే.. మూడోసారి సీఎం పదవి చేపట్టగలిగానన్నారు. పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు తనకు కూడా యువతరంపై ఎంతో అభిమానం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement