జైపూర్: రాజస్తాన్ రాజకీయాలు రోజుకోరకంగా మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విబేధాల నేపథ్యంలో సచిన్ పైలెట్ బీజేపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని సోమవారం ఉదయం వెల్లడించారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం.
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో తీవ్రంగా విభేదించిన సచిన్ పైలట్.. బీజేపీలో చేరిపోతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాక 30 మంది ఎమ్మెల్యేలు తనకు తోడుగా ఉన్నారన్నారు సచిన్ పైలెట్. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందంటూ పైలట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు బలాన్నిచ్చే విధంగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. (గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!)
నేడు(సోమవారం) జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) భేటీలో సచిన్ పైలట్ పాల్గొనబోవడం లేదని తెలిపారు. దీంతో పైలట్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం పైలట్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పైలట్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment