సాక్షి, తాడేపల్లి: మహమ్మారి కరోనా వైరస్‌కు సామాజిక దూరమే విరుగుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన... టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు.(‘ఢిల్లీ సమావేశం తర్వాతే పెరిగిన కరోనా కేసులు’)
‘‘విపత్కర పరిస్థితుల్లో కూడా టీడీపీ రాజకీయాలు చేస్తోంది. టీడీపీ నేతలు దిక్కుమాలిన, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పసుపు కుంకుమ పేరుతో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. అప్పుల భారం, వేలకోట్ల పెండింగ్ బిల్లులు రాష్ట్రానికి మిగిల్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు.
ఇక ఇప్పుడేమో డబ్బులు ఉండి కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని చంద్రబాబు మీడియా ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లలును కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు చెల్లింపు చేసింది రూ. 800 కోట్లు మాత్రమే. మేము బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్లు కూడా ఎవరికి దగ్గరో అందరికి తెలుసు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి జీతాల చెల్లింపు వాయిదా వేశాం. అత్యవసర సమయంలో ఉద్యోగులు వారి ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఉద్యోగులను కించపరిచే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.('పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం')
విపత్కర పరిస్థితుల్లో దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటంబాలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుంది. ఖర్చులు బాగా పెరిగాయి. చంద్రబాబులా కోతలు పెట్టకుండా... అర్హులందరికీ సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. కరోనా కేసులను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. దాచినా కరోనా వైరస్ దాగదు’’ అంటూ చంద్రబాబు, పచ్చమీడియా తీరుపై సజ్జల ధ్వజమెత్తారు.
‘‘ఇప్పటికే వాలంటీర్లు ఇంటి ఇంటికి తిరిగి సర్వే చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మందు లేదు. సామాజిక దూరం ఒక్కటే మందు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే ప్రభుత్వానికి సహకరించాలి. సామాజిక దూరం పాటించకపోవడం మనకు మనం ఇబ్బంది పడటమే. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. ప్రతిరోజు సీఎం కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న పది, పదిహేను రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చేసే రాజకీయాలు మానుకోవాలని చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment