
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సమాజ్‌వాది పార్టీ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. పీఓకే ఎవరి ప్రాంతమో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా ఏం జరుగుతుందో దేశ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆందోళనతో ఉన్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదని అక్కడి గవర్నరే అన్నారని గుర్తు చేశారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని దేశమంతా స్వాగతిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌లా మాట్లాడుతోందని బీజేపీ ఎంపీ పహ్లాద్ జోషి విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని చీకటి దినంగా పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొందని, కాంగ్రెస్ నాయకులు కూడా చీకటి దినం అంటూ ప్రకటనలు చేశారన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విప్ చేయడానికి ఇష్టం లేక రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాగా, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ గిరిశ్ చంద్ర, టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు ప్రకటించారు. బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment