సాక్షి, హైదరాబాద్ : వంగవీటి మోహనరంగాను కిరాతకంగా హత్య చేసింది తెలుగుదేశం పార్టీనేనని వైఎస్సార్ సీపీ నేత, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. రంగాని హత్య చేసింది టీడీపీ గూండాలు కాదని వంగవీటి రాధా చెప్పటం బాధాకరమన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగాను టీడీపీ గూండాలు ఏ విధంగా హత్య చేశారో రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. నాటి పరిస్థితులను తాము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు.
రాధా మాటలతో రంగా అభిమానిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. చేగొండి హరిరామజోగయ్య ఆ రోజులలో మంత్రిగా ఉన్నారని, ఆయన రాసిన పుస్తకంలో కూడా రంగా హత్య వెనక చంద్రబాబు స్ర్కీన్ ప్లే వహించాడని రాశారన్నారు. రాధా మాటలతో రంగా అభిమానులందరు బాధపడుతున్నారని తెలిపారు. రాధా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలు చూస్తే టీడీపీలో చేరినట్లుగానే మాట్లాడారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాధాను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని వెల్లడించారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఈ నాలుగు సంవత్సరాలలో రాధా పార్టీ కోసం ఉద్యమాలు చేశారా?. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారా?. మీ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీ తండ్రిని ఘోరాతిఘోరంగా టీడీపీ గూండాలు బస్‌లో వచ్చి హత్య చేస్తే నువ్వు మళ్లీ తిరిగి ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నావో ఆత్మపరిశీలన చేసుకో. మీ అమ్మగారు టీడీపీలో చేరినప్పుడే రంగా గారి ఆత్మఘోషించింది. ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్‌లో నువ్వు మాట్లాడిన మాటలు విని రంగా గారి అభిమానులు బాధపడుతున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మీ తల్లికి టిక్కెట్ విషయంలో సమస్య తలెత్తితే టిక్కెట్ ఇప్పించారు. రాధా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వంచిస్తున్నారో ఆ వంచనను ప్రజలకు తెలియచేయాలని వైఎస్ జగన్ తపిస్తుంటారు. వైఎస్ జగన్ గారు స్పష్టంగా ‘ మీ నాన్న గారు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి నువ్వు కూడా అక్కడినుంచి పోటీ చేస్తే బాగుంటుందని’ సూచించారు. దేవినేని నెహ్రూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే రాధా చెప్పడం వల్లనే చేర్చుకోలేద’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment