
కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్
సాక్షి, ముంబై: కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలతో అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. యెడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయం ప్రకటించగానే అసెంబ్లీలో మొదలైన సందడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘విధేయతలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని యత్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పైగా ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకే చెందిన వ్యక్తిని నియమించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఆయన శతవిధాల ప్రయత్నించారు. బహుశా ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో. ఎందుకంటే ఆయన కంటే విశ్వాసం, విధేయతను ప్రదర్శించేవారు ఉండరనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అలవాటేనని మహారాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాలవియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment