
సాక్షి, కామారెడ్డి: ఇతరుల ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలోని 50 మంది యువకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. దేశానికి ముప్పు ఉందనుకున్న సమయంలో కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకుని మాత్రమే ట్యాప్ చేస్తారని పేర్కొన్నారు.
కానీ తెలంగాణలో కొందరు అధికారులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ గురవుతన్నాయేమోనని భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ట్యాపింగ్ ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందని వెతుకుతున్నారని.. వారు ఎంత వెతికినా పర్వలేదని అన్నారు. తన ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. తన ఒక్కడి నెంబర్ మాత్రమే కాదని.. ఇంకా చాలా మంది నెంబర్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, అధికార టీఆర్‌ఎస్ ప్రోద్బలంతో పోలీసు ఉన్నతాధికారులు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన గవర్నర్ నరసింహాన్‌కు కూడా లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment