ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా నరేంద్ర మోదీ మాత్రం మరోసారి ప్రధాని కాబోరని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ దక్కించుకున్నా మోదీ రెండోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదు. అదే విధంగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఇతర పార్టీల(ఎన్డీయే కూటమి) మద్దతు లేకుండా అధికారం చేపట్టడం కష్టం. ఈ క్రమంలో మోదీకి ప్రత్యామ్నాయాన్ని ఆ పార్టీలు సూచిస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలకు గానూ 45 సీట్లు గెలుచుకుంటామని వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాటలను శరద్ పవార్ ఉటంకించారు. ‘ ఆయన తప్పుగా మాట్లాడారు. ఆయన పార్టీ 48కి 48 స్థానాలు గెలుస్తుందని చెప్పాల్సింది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను తప్పుకొన్నా తన కుమార్తె సుప్రియా సూలే, మనువడు పార్థ్ పవార్ 2019 లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment