కర్నూలు జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం దేనికోసమని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వంచించినందుకా లేక మహిళలను మోసం చేసినందుకా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొన్నందుకా లేక రైతన్నలను రుణమాఫీ పేరుతో నిట్టనిలువునా ముంచినందుకా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరులో ముస్లిం సోదరులు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ హఫీజ్ ఖాన్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ..‘ టీడీపీ ప్రభుత్వంలో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోంది. చంద్రబాబుపై ఎవరు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డే వాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు మొత్తం జగన్‌ను తిట్టడానికే సరిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను డ్రామాలుగా వర్ణించడం సిగ్గు చేటు. 14 నెలల ముందు రాజీనామా చేసిన ఎంపీల త్యాగాన్ని అందరూ కీర్తించాలి. దమ్ము, చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చార’ని తీవ్రంగా మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరువందల హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలు అపహాస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని ఎద్దేవా చేశారు. పంచభూతాలను సైతం దోచుకుతిన్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా ఏ ఏడు కా ఏడు నవ నిర్మాణ దీక్షలు చేయడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాత్రమే నవనిర్మాణ దీక్షలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉరి వేసుకున్నా ఎవరికీ లాభం లేదని, కాంగ్రెస్తో జతకట్టేందుకు టీడీపీ సిద్ధపడి, వైఎస్సార్‌సీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. దిగజారుడు టీడీపీ రాజకీయాలకు పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని అన్నారు. కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు గురించి చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో యూటర్న్ అంకుల్ అన్న పేరు మాత్రమే చంద్రబాబు సాధించిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు దుల్హన్ కార్యక్రమంలో అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరడం లేదని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment