మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం | Shiv Sena Chief Uddhav Thackeray Takes Oath As Maharashtra CM | Sakshi
Sakshi News home page

మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం

Published Thu, Nov 28 2019 6:45 PM | Last Updated on Thu, Nov 28 2019 9:04 PM

Shiv Sena Chief Uddhav Thackeray Takes Oath As Maharashtra CM - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నూతన శకం మొదలైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ సేవలు అందించనున్నారు.




గత నెల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలపై విభేదాలు రావడంతో వారి కూటమి విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది. సరిపడ బలం లేనికారణంగా బలపరీక్షకు ముందే ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. అనంతరం  రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో మహా వికాస్‌ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్‌ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్నాయి. ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్‌ కుమార్‌ షిండే, ఎంకే స్టాలిన్‌లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement