shiv sean
-
మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నూతన శకం మొదలైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ సేవలు అందించనున్నారు. గత నెల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలపై విభేదాలు రావడంతో వారి కూటమి విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది. సరిపడ బలం లేనికారణంగా బలపరీక్షకు ముందే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్నాయి. ఉద్ధవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్లు పాల్గొన్నారు. -
‘మహా’ ఉత్కంఠకు తెర!
న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో 4గంటలకుపైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. బీజేపీతో సేన తెగతెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శివసేన ఫస్ట్.. ఎన్సీపీ నెక్ట్స్ ముఖ్యమంత్రి పీఠాన్ని మొదట శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ‘పూర్తిగా ఐదేళ్లు శివసేనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించలేం. చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ నేత సీఎంగా ఉంటారు’ అని తెలిపాయి. శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల తేడా కూడా రెండు మాత్రమేనని ఎన్సీపీ నేత ఒకరు గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చల్లో సీఎం పదవిపై చర్చ జరగలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికలు జరిగే నవంబర్ 30లోపే ప్రభుత్వ ఏర్పాటవుతుందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, బాలా సాహెబ్ తోరట్ తదితరులు.. ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్, సుప్రియా సూలె, జయంత్‌పాటిల్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా సీఎంపీ(కామన్ మినిమమ్ ప్రోగ్రాం)పై చర్చ జరిగిందని, శివసేనతో సైద్ధాంతిక విబేధాల గురించి ప్రస్తావన రాలేదని ఎన్సీపీ రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమన్ వెల్లడించారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం: ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతాంగ సంక్షోభాన్ని ప్రధానికి వివరించేం దుకు సీనియర్ నేత, మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్ పవారే సరైన వ్యక్తి అని భావించి.. తామే ఆయనను ప్రధానిని కలిపే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని కోరామన్నారు. తాను కూడా పవార్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, యువనేత ఆదిత్య ఠాక్రేకు సమాచారమిస్తున్నామన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. -
శివసేనకు ఎన్సీపీ షాక్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. ఉత్కఠ పరిణామాలకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలావుండగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించేందుకు పవార్ సోమవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి భేటీకి ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి పవార్ సమాధానం చెబుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారు. శివసేన దారి ఎటు వైపో వారే తేల్చుకోవాలి’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్ స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమేనంటూ బదులిచ్చారు. దీంతో ఆయన మాటల్లో అర్థమేంటనేది అంతుపట్టలేదు. కాగా శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పూర్తి కాలంపాటు తాము అధికారంలో ఉంటామని పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందేహాలను కల్పిస్తున్నాయి. ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించిన అనంతరం ఇరు పార్టీలు ఓ ప్రకటన విడుదల చేస్తాయని తెలుస్తోంది. -
ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన
ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగంకానుంది. 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించడంతో శివసేన ప్రభుత్వంలో చేరడం ఖాయమైంది. శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చినట్టు ఫడ్నవిస్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో 5 కేబినెట్ పదవులున్నాయని వెల్లడించారు. శుక్రవారం వీరు ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. అయితే, తమకు కేటాయించనున్న శాఖల విషయంలో శివసేన గుర్రుగా ఉందని సమాచారం.