‘మహా’ ఉత్కంఠకు తెర! | Shiv Sena Congress NCP alliance in maharashtra govt formation | Sakshi
Sakshi News home page

‘మహా’ ఉత్కంఠకు తెర!

Published Thu, Nov 21 2019 3:43 AM | Last Updated on Thu, Nov 21 2019 8:31 AM

Shiv Sena Congress NCP alliance in maharashtra govt formation - Sakshi

ఢిల్లీలో కాంగ్రెస్‌–ఎన్‌సీపీ భేటీలో పాల్గొన్న శరద్‌ పవార్, అహ్మద్‌ పటేల్‌ తదితరులు

న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్‌ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్‌ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నివాసంలో 4గంటలకుపైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తర్వాత ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు.  బీజేపీతో సేన తెగతెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్‌ చౌహాన్‌ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.

శివసేన ఫస్ట్‌.. ఎన్సీపీ నెక్ట్స్‌
ముఖ్యమంత్రి పీఠాన్ని మొదట శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ‘పూర్తిగా ఐదేళ్లు శివసేనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించలేం. చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ నేత సీఎంగా ఉంటారు’ అని తెలిపాయి. శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల తేడా కూడా రెండు మాత్రమేనని ఎన్సీపీ నేత ఒకరు గుర్తు చేశారు. అయితే,  కాంగ్రెస్, ఎన్సీపీ చర్చల్లో సీఎం పదవిపై చర్చ జరగలేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.

జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికలు జరిగే నవంబర్‌ 30లోపే ప్రభుత్వ ఏర్పాటవుతుందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్‌ తరఫున మల్లిఖార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్, బాలా సాహెబ్‌ తోరట్‌ తదితరులు.. ఎన్సీపీ నుంచి నవాబ్‌ మాలిక్, సుప్రియా సూలె, జయంత్‌పాటిల్, అజిత్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా సీఎంపీ(కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం)పై చర్చ జరిగిందని, శివసేనతో సైద్ధాంతిక విబేధాల గురించి ప్రస్తావన రాలేదని ఎన్సీపీ రాజ్యసభ సభ్యుడు మజీద్‌ మెమన్‌ వెల్లడించారు.  

త్వరలోనే కొత్త ప్రభుత్వం: ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతాంగ సంక్షోభాన్ని ప్రధానికి వివరించేం దుకు సీనియర్‌ నేత, మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్‌ పవారే సరైన వ్యక్తి అని భావించి.. తామే ఆయనను ప్రధానిని కలిపే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని కోరామన్నారు.

తాను కూడా పవార్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు, యువనేత ఆదిత్య ఠాక్రేకు సమాచారమిస్తున్నామన్నారు.  ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement