శివసేనకు ఎన్సీపీ షాక్‌..! | Shiv Sena Must Choose Their Path Says Sharad Pawar | Sakshi
Sakshi News home page

శివసేనకు ఎన్సీపీ షాక్‌..!

Published Mon, Nov 18 2019 2:38 PM | Last Updated on Mon, Nov 18 2019 2:45 PM

Shiv Sena Must Choose Their Path Says Sharad Pawar - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. ఉత్కఠ పరిణామాలకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలావుండగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించేందుకు పవార్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే  వీరి భేటీకి ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి పవార్‌ సమాధానం చెబుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారు. శివసేన దారి ఎటు వైపో వారే తేల్చుకోవాలి’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్‌ స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమేనంటూ బదులిచ్చారు. దీంతో ఆయన మాటల్లో అర్థమేంటనేది అంతుపట్టలేదు. కాగా శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పూర్తి కాలంపాటు తాము అధికారంలో ఉంటామని పవార్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందేహాలను కల్పిస్తున్నాయి.  ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా  ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించిన అనంతరం  ఇరు పార్టీలు ఓ ప్రకటన విడుదల చేస్తాయని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement