ముంబై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు మృతి విషయాన్ని వెల్లడించారా? అని శివసేన అధికార పత్రిక సామ్నా.. సంపాదకీయంలో ప్రశ్నించింది. ‘ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు.
కానీ 12–13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?’ అని ‘స్వరాజ్యమంటే ఏంటి?’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment