
ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో కలిసి అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేదని ఆయన తేల్చిచెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 165మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాము త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ), పోలీసులు ఇప్పటివరకు బీజేపీ వర్కర్లుగా పనిచేస్తుండగా.. ఇప్పుడు గవర్నర్‌లు కూడా బీజేపీ వర్కర్లుగా మారిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ తన ఉచ్చులో తాను పడిపోయిందని, ఆ పార్టీ అంతానికి ఇది ఆరంభమని పేర్కొన్నారు.
అజిత్ పవర్ తప్పుడు పత్రాలను గవర్నర్‌కు సమర్పించారని, ఆ పత్రాలను నమ్మి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారని అన్నారు. గవర్నర్ అడిగితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రౌత్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన 45 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందన్నారు. ఈ వయస్సులో శరద్ పవార్‌కు వెన్నుపోటు పొడవడం ద్వారా అజిత్ పవార్ అతిపెద్ద తప్పు చేశారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment