సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. న్యాయపోరాటాలతో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. ఆయన ఆశిస్తున్న సనత్‌నగర్ సీటును మహాకూటమి పొత్తుల్లో భాగంగా మిత్రపక్షం టీడీపీకి కట్టబెట్టింది. ఇక్కడ కూన వెంకటేశ్‌గౌడ్‌కు సీటు కట్టబెడుతున్నట్టు టీటీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో కినుక వహించిన మర్రి శశిధర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తనకు ప్రత్యామ్నాయ దారులు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని మర్రి చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసినప్పటికీ.. ఇంకా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, సికింద్రాబాద్, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిర్యాలగూడ సీటును తన కొడుకుకు కట్టబెట్టాలని సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు కేటాయింపుపై సస్సెన్స్ కొనసాగుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలంగాణ జనమితికి కేటాయిస్తారని వినిపిస్తోంది.
ఎట్టకేలకు జనగామ సీటు విషయంలో పొన్నాల లక్ష్మయ్య తన పంతం నెగ్గించుకోగా.. అద్దంకి దయాకర్ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట నెగ్గకపోవడం గమనార్హం. ఉత్తమ్ నిరాకరించినప్పటికీ.. తుంగతుర్తి స్థానంలో దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బాల్కొండలో సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ కొడుకుకు చాన్స్ దక్కలేదు. ఇక్కడి నుంచి ఈరపత్రి అనిల్‌కు మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఎల్బీనగర్ సీటును టీటీడీపీ కోరినప్పటికీ.. ఆ ప్రతిపాదనను తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సుధీర్‌రెడ్డికి కట్టబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment