రాష్ట్రంలో, కేంద్రంలో వీచే రాజకీయ గాలులతో పనిలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎంతటి వారినైనా.. నిర్దాక్షిణ్యంగా ‘బొగ్గు’ చేయటమే వారికి తెలిసిన విద్య. రాష్ట్రానికి నల్లబంగారం సిరులు కురిపిస్తున్న సింగరేణి కార్మికుల తీరు.. తీర్పు ఇది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అప్రతిహత విజయాలు సాధిస్తున్న రోజుల్లోనూ సింగరేణి బెల్టులో విభిన్న తీర్పులు వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌తో వెన్నంటి ఉన్న సింగరేణీయులు 2014లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా ఆ పార్టీకి ఘన విజయాలను అందించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సింగరేణి బొగ్గు గనులు నెలవై ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందించారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఓడిపోయిన సీట్లలో సింగరేణి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలే అధికం. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కార్మికుల తీర్పు ఎలా ఉండబోతుందోనన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కొంతమేర ఆదిలాబాద్ స్థానంలో సింగరేణి ప్రభావం ఉంది.
పెద్దపల్లి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల తలరాత మార్చే శక్తి సింగరేణి కార్మికులకు ఉంది. ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు సెగ్మెంట్లలోనే 19 వేల మంది కార్మికులు ఉండగా, రామగుండం, మంథనిల్లోని ఆర్‌జీ 1,2,3 పరిధిలో కూడా అదే స్థాయిలో కార్మికులు, ఇతర స్థాయి ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాలను, స్వగ్రామాల్లోని వారి బంధువులను కార్మికులు ప్రభావితం చేస్తారు. ఈ లెక్కన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల, బెల్లంపల్లిల్లో స్వల్ప మెజారిటీలతోనే టీఆర్‌ఎస్ సిట్టింగులు విజయం సాధించగా, చెన్నూరులో మాత్రం బాల్క సుమన్ 28 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని రెండింటిలో టీఆర్‌ఎస్ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ పార్లమెంటు పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా మిగతా పార్లమెంటు స్థానాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. పెద్దపల్లితో పాటు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టిన లోక్‌సభ నియోజకవర్గం ఖమ్మం. ఈ నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపొందగా , కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే పూర్వ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాకల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని ఆసిఫాబాద్ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తరించిన 11 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం కచ్చితంగా పడుతుందని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
సింగరేణి కార్మికులకు కోపమెందుకొచ్చింది..?
తెలంగాణ ఉద్యమంలో 11 సింగరేణి ఏరియాల కార్మికులు టీఆర్‌ఎస్ వెంట నడిచారు. దీంతో టీఆర్‌ఎస్ అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) ఏర్పాటైంది. దశాబ్దాల పాటు సింగరేణిలో గుర్తింపు యూనియన్‌లుగా ఆధిపత్యం చెలాయించిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ వంటి కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అదే ఊపులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. కార్మికులకు వారసత్వ ఉద్యోగాల కోసం టీఆర్‌ఎస్ సర్కారు చేసిన ప్రయత్నానికి కోర్టు తీర్పు కారణంగా బ్రేక్ పడింది. అలాగే కార్మిక సంఘం నాయకులు కొందరు టీబీజీకేఎస్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ అన్‌ఫిట్‌నెస్ కోసం రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసే కార్యక్రమం ఇప్పటికీ సింగరేణిలో సాగుతోంది. కార్మికులను కొందరు యూనియన్ నేతలు వేధించారనే విమర్శలూ ఉన్నాయి. ఈ పరిణామాలతో విసుగు చెం దిన రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి డివిజన్‌ల కార్మికులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
విపక్ష ఎమ్మెల్యేలు టార్గెట్‌గా..!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సింగరేణి పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గెలిచిన 8 మంది విపక్షాల ఎమ్మెల్యేలను దగ్గర చేసుకునే పనిలో పడింది. రామగుండం నుంచి సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై ఘన విజయం సాధించిన కోరుకంటి చందర్ తొలుత కారెక్కారు. మొన్నటి శాసనమండలి ఎన్నికల ముందు ఆసిఫాబాద్ , పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే బాటలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నడిచారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో 8 మంది విపక్ష ఎమ్మెల్యేలలో భూపాలపల్లి, మంథని నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మినహా ఆరుగురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టే. ఈ ప్రభావం వచ్చే పార్లమెంటు ఎన్నికలపై పడుతుందని, అది టీఆర్‌ఎస్‌కు ఎంత వరకు అనుకూలిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.- పోలంపల్లి ఆంజనేయులు, కరీంనగర్ ప్రతినిధి
సింగరేణి‘క్షేత్ర’స్థాయి ఇదీ
లోక్‌సభ స్థానాలు 5
అసెంబ్లీ సెగ్మెంట్లు 11
♦ కాంగ్రెస్: మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, ఆసిఫాబాద్ (ప్రస్తుతం మంథని, భూపాలపల్లి మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలాయి)
♦ టీడీపీ: సత్తుపల్లి, (ఈ స్థానం కూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకి చేరింది)
♦ సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్: రామగుండం
♦ టీఆర్‌ఎస్: మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు
Comments
Please login to add a commentAdd a comment