సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ 22వ అఖిల భారత మహాసభల్లో భాగంగా ఆదివారం జరిగిన జాతీ య కార్యవర్గ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 17 మందితో కూడిన పొలిట్ బ్యూరోను కూడా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ప్రస్తుతం 16 మందితో ఉన్న పొలిట్ బ్యూరోలో ఏకే రాఘవన్ ఢిల్లీ కార్యవర్గంలోకి వెళ్లారు. దీంతో పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్య 15కు చేరింది. తాజాగా నీలోత్పల్ బసు, తపన్ సేన్‌లకు చోటు కల్పించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రంకు పొలిట్‌బ్యూరోలో అవకాశం వస్తుందని భావించినా చివరికి మొండిచేయే చూపారు.
95 మందితో కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ ఎన్నుకుంది. ఇందులో తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కమిటీలోకి పి.మధు, ఎం.ఎ.గఫూర్, వి.శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్యలకు అవకాశం దక్కింది.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలపై ఉద్యమిస్తాం: ఏచూరి
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఏచూరి ప్రసంగించారు. దేశంలోని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంపై ఉద్యమిస్తామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఓటమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు.
‘‘శ్రామిక కార్మిక పాలన తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తా. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయి’’అని అన్నారు.
శాశ్వత ఆహ్వానితులు: రాజేందర్ నేగి(కార్యదర్శి, ఉత్తరాఖండ్), సంజయ్ పరాటే(కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్)
ప్రత్యేక ఆహ్వానితులు: వీఎస్ అచ్యుతానందన్, మల్లు స్వరాజ్యం, మదన్ ఘోష్, పలోలి కుట్టీ, రామయ్య, కె.వరదరాజన్
సెంట్రల్ కంట్రోల్ కమిషన్: బాసుదేవ్ ఆచార్య, పి.రాజేంద్రన్, ఎస్.శ్రీధర్, జి.రాములు, బొనాని బిశ్వాస్
పొలిట్‌బ్యూరో: సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్ర పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయ్ విజయన్, హన్నన్ మొల్లా, కొడియెరి బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సుర్యకాంత మిశ్రా, మహ్మద్ సలీమ్, సుభాషిణీ అలీ, బీవీ రాఘవులు, జి.రామకృష్ణన్, తపన్‌సేన్, నీలోత్పల్ బసు
మోదీని గద్దె దింపే వరకు పోరాటం: రాఘవులు
బంగారు తెలంగాణ ఎలా ఉండాలో, దాని కోసం ఎలా పురోగమించాలో సభలో చర్చిం చామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సాయుధ పోరాటాలతో ఉద్యమాలకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డ అని.. ఆ స్ఫూర్తి, ఉత్తేజంతోనే దేశవ్యాప్తంగా కమ్యునిస్టు పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహించిందని రాఘవులు గుర్తు చేశారు.
సీపీఎం 22వ మహసభల బహిరంగసభకు అధ్యక్షత వహించిన రాఘవులు.. మహాసభలు విజయవంతంగా ముగిశాయని ప్రకటించారు. దళిత, గిరిజనులు, మహిళలపై మతోన్మాద శక్తులు లైంగిక దాడులకు పాల్పడుతున్నాయని, సామ్రాజ్యవాద శక్తుల శ్రమ దోపిడీ నుంచి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సభలో చర్చ జరిగిందన్నారు. లౌకిక శక్తులను ఏకం చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అచ్ఛే దిన్ కాదు.. కచ్చే దిన్: మాణిక్ సర్కార్
దేశంలో నాలుగేళ్లలో ‘అచ్ఛే దిన్’వస్తాయని మోదీ అన్నారని.. తీరా వెనక్కి తిరిగి చూస్తే అంతా ‘కచ్చే దిన్’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. ఎక్కువ రోజులు ప్రజలను మోసం చేయలేమని గుర్తించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజల మధ్య అశాంతి సృష్టించి, ప్రజల్ని చీల్చుతున్నాయని ఆరోపించారు.
అందులో భాగంగానే దళితులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయం కాదని.. అవి నాణేనికి బొమ్మా బొరుసు లాంటి పార్టీలే అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయమన్నారు. ప్రమాదం పొంచి ఉందని, శత్రువు మన తలుపు తడుతోందని, ఇక ప్రజా పోరాటాలకు సిద్ధమవ్వాలని కార్యకర్తలను కోరారు.
మోదీ హఠావో.. దేశ్ బచావో: బృందా కారత్
‘ఎర్రజెండా లేకుండా చేశామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ఎర్రజెండాను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుందని వాళ్లు గుర్తు పెట్టుకోవాలి’ అని సీపీ ఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హెచ్చరించారు. మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని, ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ నినాదం దేశమంతటా వినిపిస్తోందన్నారు.
దేశంలో మహిళలు, చిన్నారులపై లెంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఆసిఫాపై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిపి పాలిస్తున్న వీళ్లు నేరుస్థుల రక్షకులని విమర్శించారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మక్కా మసీదు ఘటనకు పాల్పడిన వారిని నిర్దోషులుగా విడుదల చేయించారని ఆరోపించారు.
ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య: పినరయి
దేశంలో ప్రతి అరగంటకు ఒకరు చొప్పున రైతులు ఆత్మహత్మ చేసుకుంటున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ప్రపంచీకరణ, 1991లో వచ్చిన సరళ్జీకృత ఆర్థిక విధానాలను బీజేపీ ముమ్మరం చేసిందని.. పర్యవసానంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందన్నారు.
కుబేరులకే మేలు చేసే విధానాలతో నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. ఉద్యోగ, జీవన భద్రత లేకుండా పోయిందన్నారు. మోదీ పాలనలో మతతత్వ వాదులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని.. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బేఠీ బచావో..బేఠీ పడావో’అనేవి మోదీ బూటకపు మాటలని విమర్శించారు. మోదీ హయంలో సీనియర్ న్యాయమూర్తులే ప్రజల ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment