కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నువ్వా నేనా అంటూ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పార్టీ అధినేతలతో రోడ్ షో లు నిర్వహిస్తూ గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాహుల్ గాంధీ పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని భావించిన కృష్ణ గతేడాది బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కూతురు శాంభవి రాజరాజేశ్వరనగర అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారని, బీజేపీ ఇందుకు నిరాకరించడంతో కృష్ణ పార్టీని వీడేందేందుకు సిద్ధపడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మానసికంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయిన కృష్ణ కాషాయ పార్టీలో ఇమడలేకపోతున్నారని, తనకు తగిన ప్రాధాన్యం లభించడంలేదని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర మాట్లాడుతూ.. కృష్ణను పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అవన్నీ ఊహాగానాలే: బీజేపీ
ఎస్.ఎం. కృష్ణ పార్టీ సమావేశాలకు, ఫంక్షన్లకు హాజరుకావడం లేదని, పార్టీలో ఆయనకు తగిన స్థానం ఇవ్వడం లేదా అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా... అలాంటిదేమీ లేదని బీజేపీ పేర్కొంది. ఓల్డ్ మైసూర్‌లో బలహీనంగా ఉన్న బీజేపీ.. కృష్ణను రంగంలోకి దింపడం ద్వారా వొక్కలిగ ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కాగా ఈ విషయమై ఎస్.ఎం. కృష్ణ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment