
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కాగా, రాహుల్ 20వ తేదీ పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా గురువారం రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులను చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసగించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ పర్యటనతో రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ 20వ తేదీ ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment