సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. కేవలం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తే సరిపోదని.. నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలంటూ నేతలకు సూచించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం ట్విటర్లు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రజలను చైతన్య పరచలేమని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆమె వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్ వల్లబాయ్‌పటేల్, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని వాటిన్నింటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ట్విటర్ ఖాతా లేని వారిని ఆమె మందలించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్పీకరించిన అనంతరం.. సోషల్ మీడియాపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ నేతలంతా ప్రచార మాధ్యమాల్లో యాక్టీవ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సొంత ట్విటర్ ఖాతాను ప్రారంభించి.. ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలీలో స్పందిస్తున్నారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తన బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్నారు. సోషల్ మీడియానే నమ్ముకున్న కాంగ్రెస్‌కు కనీసం సీట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో నేతలంతా ప్రజలకు చేరువకావాలంటూ పార్టీ అధినేత్రి సోనియా ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment