న్యాయమూర్తులు, న్యాయవాదులను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు?
కవితకు బెయిల్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
‘ఓటుకు కోట్లు’ కేసును వేరే రాష్ట్రానికి బదిలీచేయాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు
ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, ఇతర నిందితులకు నోటీసులు
విచారణ రెండు వారాల పాటు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన పోస్టులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉన్నత స్థానాల్లో ఉండేవారు బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోకి న్యాయమూర్తు లు, న్యాయవాదులను ఎందుకు లాగుతారని సీఎం రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రాలను ప్రశ్నించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులపై పోస్టులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
‘ఓటుకు కోట్లు’ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి
‘ఓటుకు కోట్లు’ కేసును హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, కవిత బెయిల్ సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై సీఎం రేవంత్ వివాదాస్పద కామెంట్లు చేశారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.సుందరం వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏసీబీకి ఇన్‌చార్జిగా ఉన్నారని, ఆయన నిందితుడిగా ఉన్న ‘ఓటుకు కోట్లు’ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. వేరే రాష్ట్రానికి బదిలీ చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందేమో అని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొనగా.. ఏసీబీ అధికారులు సీఎంకు నివేదిక ఇస్తారని, ఎవరిని విచారించాలనేది హోంశాఖ నిర్ణయిస్తుందని, వేరే రాష్ట్రంలో అయితే రేవంత్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉండరని వివరించారు. అయితే.. ఏసీబీ అధికారులు ఓటుకు కోట్లు కేసులో 25 మంది సాక్షులను విచారించి, అన్ని వివరాలు సేకరించారని సీఎం రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది రోహత్గి తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌కు బాధ్యత ఉండదా?
ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో గందరగోళం సృష్టించేలా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సుందరం కోర్టుకు వివరించారు. కోర్టు ఆర్డర్ కాపీని, కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి చిత్రాలతో పోస్టుచేశారని.. ‘ల్యాండ్ గ్రాబర్స్‌కు ఒక రూల్.. ప్రభుత్వానికి ఒక రూలా? వాట్ ఈజ్ దిస్ మై లార్డ్?’ అంటూ పెట్టిన మరో పోస్టును ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు.
అయితే.. ఇందులో రేవంత్‌రెడ్డి పాత్ర లేదని ముకుల్ రోహత్గి పేర్కొనగా.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యత ఉంటుందని సుందరం ధర్మాసనానికి వివరించారు. దీనిపై ఇటీవల రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పారని, న్యాయవ్యవస్థపై తనకున్న గౌరవాన్ని వెలిబుచ్చారని రోహత్గి పేర్కొన్నారు. ఈ దశలో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకుని.. ‘అత్యున్నత పాలనాధికారం కలిగి ఉన్నవారు బాధ్యతగా మెలగాలి. కోర్టులు, న్యాయమూర్తులను రాజకీయాల్లోకి లాగడం సబబు కాదు..’ అని స్పష్టం చేశారు.
అయితే ఇరుపక్షాల వివరణలు పూర్తయ్యాయని.. బదిలీ పిటిషన్ విచారణను ముగించాలని న్యాయవాది రోహత్గి పేర్కొన్నారు. దీంతో జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకుని తెలంగాణలో వరదలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఆ పనుల్లో నిమగ్నమై ఉంటుందని, తాము అన్ని సున్నిత అంశాలనూ పరిశీలిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంలో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, సండ్ర వెంకట వీరయ్యలను ఆదేశించారు. ఇస్తున్నామని తెలిపారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment