
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మీడియాపై చిందులు తొక్కారు. అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపు జరపడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఇష్టమైతేనే సమాధానం చెబుతా’ అంటూ మండిపడ్డారు.
రైతులకు కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి, డబ్బులు మాత్రం ఏప్రిల్ తరువాతే ఇవ్వనుంది. ఈ విషయం గురించి విలేకరులు ప్రశ్నించగా సోమిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే నెల బడ్జెట్‌కి ఇప్పుడు చెక్కులిస్తారా అన్న ప్రశ్నకు నీళ్లు నమిలారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు.
రైతులను మభ్యపెట్టే యత్నం
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా కేబినెట్ సమావేశం పెట్టి చంద్రబాబు సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఆమోదం తెలిపి, పోస్ట్ డేటెడ్ చెక్కులతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలలోని రైతు భరోసాను కాపీ కొట్టి, వచ్చే ఏడాది పథకానికి కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలపడం గమనార్హం. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఇప్పటికే డ్వాక్రా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment