‘హైదరాబాద్‌లో చేసిన తప్పే అమరావతిలో చేస్తున్నారు’ | Somu Veerraju Fires On TDP Over Amaravati Construction | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌లో చేసిన తప్పే అమరావతిలో చేస్తున్నారు’

Published Mon, Sep 10 2018 4:04 PM | Last Updated on Mon, Sep 10 2018 5:52 PM

Somu Veerraju Fires On TDP Over Amaravati Construction - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి అబద్ధాలకు నిలయంగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడుతుందని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యేల నివాసాలు నిర్మించామని నిధులు తీసుకున్నారు.. కానీ ఎక్కడ నిర్మించారో తమకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి టీడీపీ సహకరించ లేదా అని సూటిగా ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎంపీలు ప్రశ్నించారా అని నిలదీశారు. టీడీపీ నీతి, నిజాయితి లేని పార్టీ అని ఆరోపించారు.  

టీడీపీ నేతలు అరిగిపోయిన రికార్డులాగా రాజధాని అమరావతి పేరు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఇస్తే.. కారిపోతున్న తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. శాసనసభ, శాసనమండలిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభ్యుల ప్రశ్నిస్తుంటే ముప్పేట దాడి చేస్తున్నారని తెలిపారు. రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని.. నిర్మాణం చెయ్యని రాజధానికి అసెంబ్లీలో డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని అన్నారు.

దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకున్నాయని తెలిపారు. బీజేపీ, టీడీపీలు కలిసి ఉన్నప్పుడు తమ పార్టీని పొగుడుతూ తీర్మానాలు చేశారని కానీ విడిపోయాక సభలో ప్రధాని నరేంద్ర మోదీని తిడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 32 వేల కోట్ల రూపాయల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను టీడీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. డ్రైనేజీలు కట్టడానికి కేంద్రం 1000 కోట్ల రూపాయలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోయిందని విమర్శించారు. హైదరాబాద్‌లో చేసిన తప్పునే అమరావతిలో చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం చేతకాకుంటే తామే నిర్మించి చూపెడతామని సవాలు విసిరారు. రాజధాని పేరుతో విదేశీ సంస్థలకు భూములు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు డీపీఆర్‌ ఇవ్వలేదని అన్నారు. సభలో తమ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement