కాంగ్రెస్‌లోకి డీఎస్‌.. అసలు ఏమైంది ? | Sonia Gandhi Green Signal For D Srinivas Re Joining Into Congress Party Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి డీఎస్‌.. అసలు ఏమైంది ?

Published Thu, Jun 28 2018 12:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Sonia Gandhi Green Signal For D Srinivas Re Joining Into Congress Party Telangana - Sakshi

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌ : నిజామాబాద్‌ (ఇందూరు) రాజకీయాలే రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ను వీడటానికి కారణమయ్యాయి! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కవితకు వ్యతిరేకంగా డీఎస్‌ కుమారుడు అరవింద్‌ ప్రచారానికి పూనుకోవడం ఆమెకు ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు అదే డీఎస్‌ టీఆర్‌ఎస్‌ను వీడటానికి కారణమైందని ఆయన సన్నిహితులంటున్నారు. తనకు, తన అనుచరులకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదన్న అసంతృప్తితో ఉన్న డీఎస్‌కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం కుమార్తె కవిత నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం డీఎస్‌కు వ్యతిరేకంగా లేఖ రాసి చర్యలు తీసుకోవాలని పార్టీని కోరిన సంగతి పక్కన పెడితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు పూర్వరంగం ఎప్పుడో సిద్ధమైందని సమాచారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్న డీఎస్‌.. ఆయన ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో మాట్లాడారని, ఆమె అంగీకారం మేరకు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

పదవి ఉన్నా అసంతృప్తి! 
వాస్తవానికి డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరగానే ఆయన స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. అయితే పదవి ఇచ్చారు కానీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధ ఆయనలో ఉంది. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు తన సన్నిహితుల వద్ద చెప్పారు కూడా. ఈ ఆవేదనకుతోడు తన ముఖ్య అనుచరుడు భూపతిరెడ్డి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు రుచించలేదు.

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో తన వర్గీయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినప్పుడే టీఆర్‌ఎస్‌ను వీడాలని డీఎస్‌ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్నుంచి ఆయన పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. టీఆర్‌ఎస్‌లో పేరుకు ఎంపీ పదవి ఉన్నా.. తన స్థాయికి తగిన ప్రాధాన్యం లేదని, తన అనుచరులను పట్టించుకోవడం లేదనే ఆవేదనతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్‌లో రాజుకున్న నిప్పును ఢిల్లీలో ఆర్పివేసేందుకు ఆయన ప్రయత్నించారని రాజకీయ వర్గాలంటున్నాయి. 

దాదా.. వినండి నా బాధ 
కాంగ్రెస్‌లో తన పునరాగమనానికి డీఎస్‌ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఎంచుకున్నారు. ఢిల్లీలోని తాల్‌కటోరాలో ఉన్న ప్రణబ్‌ నివాసానికి వెళ్లి తాను కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు మనోగతాన్ని వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తన పట్ల వ్యవహరించిన తీరు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని దాదాకు వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరాలంటే తనకు సోనియా అపాయింట్‌మెంట్‌ లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో.. ప్రణబ్‌ అక్కడ్నుంచే సోనియాకు ఫోన్‌ చేయించి ఆమెతో మాట్లాడించారని సమాచారం.

పార్టీని వీడినందుకు తొలుత సారీ చెప్పిన డీఎస్, ఆ తర్వాత దిగ్విజయ్‌ వైఖరితోనే తాను పార్టీని వీడానని సోనియాకు వివరించారని, ఆమె సమ్మతించడంతోపాటు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అంటున్నారు. డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు రాష్ట్ర నాయకులకు అందాయి. దీంతో ఓ వర్గం నేతలు ఆయన రాకను గట్టిగావ్యతిరేకిస్తున్నారు. డీఎస్‌ కష్టకాలంలో కాంగ్రెస్‌ను వీడటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే సోనియా ఆదేశాలు ఉండటంతో సీనియర్‌ నేతలు ఈ వాదనను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఆమె సూచనల మేరకే పార్టీ సీనియర్‌ నేతలు ఆయనతో పలుమార్లు చర్చిస్తున్నట్లు రాష్ట్ర నేతలకు సమాచారం అందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement