సోనియా గాంధీ.. నరేంద్ర మోదీ (జత చేయబడిన చిత్రం)
సాక్షి, బెంగళూరు: వాస్తవాలను వక్రీకరించటంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం బీజాపూర్ జిల్లా విజయపురలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సుమారు రెండేళ్ల తర్వాత ఆమె బహిరంగ సభలో పాల్గొనటంతో పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ప్రజలు సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.
‘మోదీగారు ఓ మంచి వక్త అన్న సంగతిని నేనూ అంగీకరిస్తా. కానీ, ఆయన ఇప్పుడు ఓ నటుడిలా మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపవన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. కర్ణాటక విషయంలో కేంద్రం పక్షపాత ధోరణిలో వ్యవహరించటం అందరూ చూశారు. కరువు విషయమై మీ ముఖ్యమంత్రి(సిద్ధరామయ్యని ఉద్దేశించి) ప్రధానిని కలవటానికి ఢిల్లీ వెళ్లారు. కానీ, ప్రధాని మాత్రం అందుకు సుముఖత చూపలేదు. రైతులనే కాదు.. యావత్ కన్నడ ప్రజలను ప్రధానిని అవమానించారు. పుండు మీద కారం చల్లినట్లు కేంద్రం ఇచ్చే కరువు పరిహారం విషయంలోనూ కర్ణాటకకు అన్యాయం జరిగింది. సబ్‌కా సాథ్-సబ్‌కా వికాస్ అంటే ఇదేనా?’ అని కేంద్రాన్ని ఆమె నిలదీశారు.
.. ‘తప్పు చేసినప్పుడల్లా ఆయన(మోదీ) వాస్తవాలను వక్రీకరిస్తుంటారు. రాజకీయాల కోసం త్యాగధనుల పేర్లను ఆయన వాడుకుంటారు. అడ్డగోలుగా అభివృద్ధి హామీలిచ్చారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వచ్చారు. కానీ, కాంగ్రెస్ మాత్రం కర్ణాటక అభివృద్ధి కోసం కృషి చేసింది. తన సంక్షేమ పథకాలతో సిద్ధరామయ్య కర్ణాటకను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెడితే.. దానిని బీజేపీ వ్యతిరేకించింది. రైతులనే కాదు అన్ని వర్గాల వారిని తప్పుడు హామీలతో మోదీ మోసం చేశారు. కానీ, పేదల కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న పార్టీ కాంగ్రెస్సే. అందుకే మరోసారి అవకాశం ఇవ్వండి’ అని సోనియా గాంధీ ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment