సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసుద్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అండదండలతోనే సోనూసుద్ వలస కార్మికులకు సహాయం చేస్తున్నాడంటూ సామ్నా ఎడిటోయల్ వేదికగా రౌత్ ఆరోపించిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడని, త్వరలోనే ప్రధాని మోదీతో భేటీ సైతం అవుతారని విమర్శలు ఎక్కుపెట్టారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే సోనూసుద్‌పై ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. (సోనూకు రాజకీయ రంగు: మోదీతో భేటీ!)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌక్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటున్నందుకు సీఎం ఠాక్రే అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం నివాసంలో వీరితో సమావేశం జరిగినట్లు ట్విటర్ వేదికగా సోసూసుద్ వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి ఠాక్రే, ఆదిత్యాతో సమావేశమైనందుకు సంతోషంగా ఉంది. వలస కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటాను. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటాను. భవిష్యత్‌లో కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను’ అని తెలిపాడు. తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు చెక్ పెట్టేందుకే ఠాక్రేతో భేటీ అయినట్లు తెలుస్తోంది.
కాగా ఆదివారం సామ్నాలో ప్రచురితమైన ఎడిటోరియల్‌పై సీఎంతో భేటీ సందర్భంగా సోనూసుద్ చర్చకు తీసుకొచ్చినట్లు సమాచారం. వలస కార్మికులకు అండగా నిలుస్తున్న తనకు రాజకీయ రంగు పులమడం సరైనది కాదని వారించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సహాయ, సహకారులు ఉంటే భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తానని సీఎంతో చెప్పినట్లు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment