మా ఫ్రంట్‌ ఆషామాషీ చిల్లర రాజకీయం కాదు | SP Chief AKhilesh Yadav Meets CM KCR In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ఇది స్టంట్‌ కాదు

Published Thu, May 3 2018 1:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

SP Chief AKhilesh Yadav Meets CM KCR In Pragathi Bhavan - Sakshi

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎవరిని ప్రధాని చేయాలనేది ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం కానే కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలను ఏకం చేయటం లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో జరుపుతున్న సంప్రదింపులపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, ఇది ఆషామాషీ చిల్లర మల్లర రాజకీయం కానే కాదని తేల్చి చెప్పారు. తమది థర్డ్, ఫోర్త్‌.. ఫిఫ్త్‌ ఫ్రంట్‌ కానే కాదని, రైతులు, ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి కొత్త మార్పు దిశగా దేశాన్ని నడిపించే యత్నమని అన్నారు. ‘‘ఇది ఆషామాషీ ప్రయత్నం కాదు. రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు. పరిపాలనా, ఆర్థిక రంగాలన్నింటిలో మార్పు రావాలి. 

ఇంత పెద్ద దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా పెద్ద ప్రయత్నం జరగాలి. రాజకీయ పార్టీలే కాదు. చాలా మందిని కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’అని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌ వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రగతి భవన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. మధ్నాహ్నం భోజనం తర్వాత ఇద్దరూ దాదాపు రెండు గంటల పాటు ప్రత్యామ్నాయ కూటమిపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెడరల్‌ ఫ్రంట్‌కు అఖిలేశ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీలు కె.కేశవరావు, బి.వినోద్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

అనంతరం కేసీఆర్, అఖిలేశ్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ప్రారంభం మాత్రమే. ఇది పొలిటికల్‌ గేమ్‌ కాదు. అభ్యుదయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కలిసొచ్చే పార్టీలు, నేతలందరినీ కలుపుకుంటాం. మా ద్వారాలు తెరిచే ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఎజెండాకు రూపకల్పన చేసి ప్రజల ముందుపెడతాం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి మరికొందరు నేతలతో భేటీ అవుతా. ఇంత పెద్ద దేశానికి ఎజెండా తయారు చేయటం ఒక్కరితో సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాల సూచనలు తీసుకుంటాం. తర్వాత రాజకీయ దృఢ సంకల్పంతో ముందుకెళ్తాం’’అని సీఎం కేసీఆర్‌ తన కార్యాచరణను వెల్లడించారు. 

దేశంలో అన్ని వర్గాల్లో అసంతృప్తి
దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నానని, అఖిలేశ్‌ యాదవ్‌తో నెల రోజులుగా చాలాసార్లు ఫోన్లో మాట్లాడానని సీఎం చెప్పారు. ‘‘ఇటీవల వివిధ పార్టీల నేతలతో సమావేశమైనప్పుడు అన్ని విషయాలు తెలియజేశాను. ఇప్పుడు నేరుగా భేటీ కావటంతో అఖిలేశ్‌తో సమగ్రంగా చర్చలు జరిపాం. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎలా ముందుకు వెళ్లాలనేది మాట్లాడుకున్నాం. దేశ రాజకీయాలు, పరిపాలనలో గుణాత్మక మార్పు రావాలి. కొంత ఆర్థికంగా వృద్ధి సాధించినప్పటికీ ఆశించిన తీరుగా లేదు. 

దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. రైతులు, దళితులు, నిరుపేదలు, మైనారిటీలందరూ నిరాశతో ఉన్నారు. అందుకే మార్పు రావాలి. ఈ పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నం మొదలైంది. పొరుగున ఉన్న చైనా మూడు దశాబ్దాల కిందట భారత్‌ కంటే అన్నింట్లో వెనుకబడి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే పోటీ పడే స్థాయికి వృద్ధి చెందింది. భారత్‌ కూడా గుణాత్మకంగా అభివృద్ధి చెందాలి. ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండాలి. నా ప్రయత్నాలకు అఖిలేశ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు’’అని అన్నారు. 

రైతు సంతోషంగా ఉంటేనే దేశాభివృద్ధి: అఖిలేశ్‌ 
కేసీఆర్‌తో చర్చలు తనకు సంతృప్తినిచ్చాయని, ఆనందంగా ఉందని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తన సుపరిపాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని చూరగొన్నారు. ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీటిని అందించే ప్రయత్నాలతో ప్రజల్లో భరోసా నింపారు. దేశంలో జరగాల్సిన ఆర్థిక వృద్ధి ఆ స్థాయిలో లేదు. స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ సాగు, తాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 

రైతులు సంతోషంగా లేకుంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు ప్రజల ఆశలు నెరవేర్చలేక పోయాయి. మన శక్తి సామర్థ్యాలకు కొదవ లేదు.. విదేశాల్లో మన యువత సత్తా చాటుతోంది. మేం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది. బీజేపీ అనేక హామీలు ఇచ్చినా ఏవీ నెరవేర్చలేదు. ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉంది. వారిచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయి? నోట్ల రద్దుతో పెద్ద మార్పు వస్తుందని బీజేపీ చెప్పింది. అది నిజమైందా? యూపీలో ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దేశంలో మార్పునకు బీజం పడింది. 

కేసీఆర్‌ తలపెట్టిన గుణాత్మక మార్పును సమాజ్‌వాదీ పార్టీ సమర్థిస్తోంది. మళ్లీ కలుస్తాం. చర్చలు జరుపుతాం. దేశంలోని రైతులు, పేదలు, యువతకు మార్పు దిశగా బీజం పడింది’’అని అఖిలేశ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి వచ్చిన అఖిలేశ్‌కు బేగంపేట విమానాశ్రయంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్వాగతం పలికారు. సీఎంతో భేటీ తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన లక్నోకు తిరుగుపయనమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement