లక్నో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్.. అదే స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన.. డింపుల్‌ను ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్‌లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు.
అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 14 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద అనంతరం బీజేపీలో చేరి ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్‌ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment