‘‘చూశారా సార్... ఈసారి ఎన్నికల్లో ఇప్పటివరకూ ఏ పార్టీ వాళ్లూ మేనిఫెస్టోలు ప్రకటించలేదట. ఈరోజే పేపర్లో చూశా. కానీ ఒకళ్లను ఇంకొకళ్లు మాత్రం విపరీతంగా తిట్టుకుంటున్నారు’’
‘‘పోనీలే.. మేనిఫెస్టోలో ఉన్నది మాత్రం చేసి చస్తున్నారా?’’
‘‘మేనిఫెస్టోలో పెడితే ఒక కమిట్‌మెంట్ ఇచ్చినట్టు కదా. ‘ఆరోజు మీరే కదా అలా చెప్పారు’ అంటూ నిలదీయడానికి వీలవుతుంది కద్సార్. ప్రజలు మోసపోతున్నారనే నా బాధ’’
‘‘ఏం పర్లేదు. ఓటర్లెప్పుడూ ముల్లా నస్రుద్దీన్ అంత తెలివిగా, చిలిపిగా ఉంటారు. గాడిద తన పని కాకుండా నక్క పని చేస్తే బుద్ధి చెబుతారు’’
‘‘ముల్లా నస్రుద్దీన్ కథలు నేనూ విన్నా.. అయినా గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని కుక్క చేయాలి అని కదా కథ. మరి ఈ నక్క ఎక్కడ్నుంచి వచ్చింది కథలోకి?’’
‘‘ఓ కథ చెబుతా విను. ముల్లా నస్రుద్దీన్ సరుకులు తెచ్చుకునే కిరాణా కొట్టు వాగు అవతల ఉండేదట. సరుకులన్నీ తన గాడిద వీపు మీద వేసే సమయంలో ముందుగా ఉప్పు మూట వేసి దాని మీద మిగతా సామాన్లన్నీ పేర్చేవాడట. సామాన్లు మోస్తున్న గాడిద ఓ కీలకం కనిపెట్టింది. ఉప్పుబస్తా నీళ్లలో లోతుగా మునిగేలా ఒంగుతూ మెల్ల మెల్లగా నడుస్తూ ఉంటే వీపు మీది మోతబరువు బాగా తగ్గినట్టు గ్రహించింది. దాంతో ఎప్పుడు సరుకులు తెచ్చినా అదే పని చేయడం మొదలుపెట్టింది. రెండు మూడు సార్లు చూశాక గాడిద కాస్తా నక్క తెలివితేటలు ప్రదర్శిస్తోందని అర్థమైంది ముల్లా గారికి. అంతే... నెక్స్‌ట్ టైమ్ ఎప్పటిలాగే బస్తాను వీపు మీద వేయించి మిగతా సామాన్లు సర్దాడు ముల్లా. గాడిద కూడా ఎప్పటిలాగే ముక్కుతూ మునుగుతూ తక్కుతూ తారుతూ లోతు నీళ్లలోకి వెళ్తూ బరువు తగ్గించుకోడానికి ప్రయత్నించింది. అంతే.. ఎప్పట్లా కాకుండా బస్తా బరువు అంతకంతకూ పెరిగిపోసాగింది. కాస్త నిటారుగానూ, బస్తాను తడపకుండా నడిస్తేనే బరువు తేలికవుతోంది. దాంతో అప్పట్నుంచి బస్తాను ముంచకుండా తేవడం మొదలు పెట్టిందట ఆ గాడిద’’
‘‘గాడిదకు బుద్ధి చెప్పడానికి ముల్లా ఏం చేశాడు?’’
‘‘ఇంట్లోని చెడిపోయిన పరుపును ఎక్కడైనా పారేద్దామని బయలుదేరిన ముల్లాకు ఓ ఆలోచన వచ్చింది. దాంతో ఆ దూదినంతా తాను ముందే సిద్ధం చేయించిన ఓ బస్తాలో బాగా కూరిపెట్టించాడు. అలా గాడిదకు బుద్ధి చెప్పాడు సస్రుద్దీన్’’
‘‘ఇంతకీ ఏమంటారు?’’
‘‘నువ్వేం బెంగపడకు. ఓటర్లెప్పుడూ ముల్లా నస్రుద్దీన్ అంత తెలివైన వాళ్లే. ఓట్లు కావాలంటే తిట్లు కాదు... ఏం చేస్తారో ఒట్లు వేయండంటూ తమ దగ్గరికి వచ్చే అభ్యర్థులను బాగానే నిలదీస్తున్నారు లే. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చిన వారు ఎప్పుడైతే ఓటరు కోసం కష్టపడకుండా.. సొంతం కోసం నక్కవేషాలు వేయడం మొదలుపెడతారో.. ఓటు దెబ్బతో అభ్యర్థి వీపు మీద ఓటమిభారం మోపేస్తారు. అచ్చ తెలంగాణ సామెతగా చెప్పాలంటే.. కర్రుకాల్చి వాతపెడతారు. ఓకే’’.
నక్క వేషాలు వద్దు
Published Tue, Nov 20 2018 3:53 AM | Last Updated on Tue, Nov 20 2018 3:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment