TS: ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు చూశారా? | TS Assembly Elections 2023: BRS BJP Congress Manifestos Details | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు.. ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయంటే..

Published Fri, Nov 17 2023 10:28 AM | Last Updated on Mon, Nov 27 2023 2:36 PM

TS Assembly Elections 2023: BRS BJP Congress Manifestos Details - Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీ అంకెలతో.. అంతకు మించి అన్నివర్గాలను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో హామీలను ప్రకటించాయవి. ప్రధాన మూడు పార్టీల మేనిఫెస్టోలను విడుదల వారీగా చూస్తే.. 

తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల ప్రకటనలోనే కాదు.. మేనిఫెస్టోను కూడా ముందుగానే ప్రకటించింది. రైతు బంధు, పెన్షన్‌ పెంపులను దశలవారీగా అందించడం ప్రధానంగా.. అలాగే మిగతా హామీలను స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. 

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..

  • రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్‌ బీమా పథకం
  • తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా
  • కేసీఆర్‌ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
  • కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా
  • తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ
  • అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తాం
  • పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతాం
  • దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు
  • రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం
  • అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి
  • అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు
  • అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్
  • ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు
  • రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు
  • అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తాం
  • అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తాం
  • కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం
  • జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు.

అక్టోబర్‌ 15వ తేదీనాడు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ..
‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం’’

👉: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో పూర్తి కాపీ

కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ఆరు గ్యారెంటీల అమలును ప్రకటించింది. ఆపై అధికారిక మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నవంబర్‌ 17వ తేదీన గాంధీభవన్‌లో మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు.

తెలంగాణ ఎన్నికల కోసం అభయ హస్తం పేరిట మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఆరు గ్యారెంటీల హామీలను రంగరించి.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం  42 పేజీలతో అభయ హస్తం తెచ్చింది. 

కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే..

1. మహాలక్ష్మి

  • మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం
  • రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌
  • మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం

2. రైతు భరోసా

  • రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం.
  • వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్‌ అందజేత

3. గృహ జ్యోతి
రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా

4. ఇందిరమ్మ ఇళ్లు

  • ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
  • అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత.

5. యువవికాసం

  • విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్‌ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్‌ కొనుగోలు, హాస్టల్‌ ఫీజులు, ల్యాప్‌టాప్‌, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన.
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు.

6. చేయూత

  • ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.
  • పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు

అభయ హస్తం రిలీజ్‌ తర్వాత టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు.. 
‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ .

👉: కాంగ్రెస్‌ మేనిఫెస్టో పూర్తి కాపీ 

-----------

బీజేపీ మేనిఫెస్టో..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత మంత్రి అమిత్ షా నవంబర్​ 18న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 

1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
- అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు
- ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం
- కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు
3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం
4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్
5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు
6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి.
7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 
8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం.
9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్.
10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం.

  • బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం 
  • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం 

అమిత్​ షా మాట్లాడుతూ..
సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు.

👉: బీజేపీ మేనిఫెస్టో పూర్తి కాపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement