
సచివాలయం వెనక తన భూమిలో నుంచి రైతును ఈడ్చేస్తున్న పోలీసులు (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన తెలుగు దేశం పార్టీ నాయకులు.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరింతగా బరితెగిస్తున్నారు. తమ పార్టీకి ఎదురుతిరిగిన నాయకులు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ‘అడ్డు’ తొలగించుకునేందుకు సైతం సిద్ధపడుతున్నారు. సాధారణ ప్రజలను కారుతో తొక్కించి చంపేస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటుండగా.. వాస్తవం మాత్రం ఆందోళనకరంగా ఉంది. రాజధాని ప్రాంతంలో సాధారణ ప్రజలకు రక్షణ లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శుక్రవారం నెక్కల్లులో తాడికొండ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రధాన అనుచరులు బీసీ కులస్తులపై కారుని ఎక్కించి హత్య చేసిన ఘటనతో రాజధాని ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దౌర్జన్యాలు పెరుగుతాయంటూ సీఎం స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారాలకు దిగుతుంటే.. ఏకంగా రాజధాని ప్రాంత ప్రజలే గత ఐదేళ్లలో ఎన్నడూ లేని రౌడీ రాజ్యాన్ని చూసినట్లు వాపోతున్నారు.
ఐదేళ్లలో పెరిగిన దాడులు, దౌర్జన్యాలు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు రాజధానిలో చేయని అరాచకాలు లేవు. ప్రతిపక్ష నాయకులు, తమ అవినీతి, అక్రమాలకు అడ్డొచ్చిన అమాయక ప్రజలే టార్గెట్‌గా దాడులు, అక్రమ కేసులు బనాయించారు. సామాన్య ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేసేలా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. మాట వింటే సరే.. లేదంటే అంతమొందించడం, దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి హింసించడం వారికి పరిపాటిగా మారిపోయాయి.
మందడంలో హోటల్ మేనేజర్‌పై దాడి చేస్తున్న టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ (ఫైల్)
రాజధాని భూములు తగలబెట్టడం ప్రారంభించి..
రాష్ట్ర రాజధానికి భూములివ్వలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దలు ఎలాగైనా భూములు లాక్కోవాలని 2014 డిసెంబర్‌లో రాత్రికి రాత్రే రాజధాని ప్రాంతంలో ఆరు చోట్ల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లు తగలబెట్టించారనేది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ పని చేయించారని టీడీపీ పెద్దలు అసత్య ప్రచారం చేయించారు. ఆ తర్వాత రైతులే చేశారంటూ వందలాది మంది రైతులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ బాపట్ల లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న నందిగం సురేష్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి భౌతికంగా, మానసికంగా హింసించారు. వైఎస్ జగన్ స్వయంగా తనతో చేయించినట్లు ఒప్పుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఇందుకు ఆయన, రైతులు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీలేక గతేడాది అక్టోబర్‌లో కేసు మూసేశారు.
అధికారులపై, రాజధాని రైతులపై నిత్యం దాడులు
2018 జనవరి 22న మందడం గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, జన్మభూమి కమిటీ సభ్యుడైన మాదాల శ్రీను అధికార మదంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి గద్దె రామ్ హనుమాన్‌పై దుర్భాషలకు దిగడంతో పాటు పంచాయతీ కార్యాలయంలోనే దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలోనే నిర్భందించి తాళాలు వేశాడు. అనంతరం జిల్లాకు చెందిన ఓ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే బెదిరింపులకు తోడు ప్రభుత్వ ఉద్యోగులు.. రాజీ పడాలని గద్దె రామ్ హనుమాన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో కేసు వెనక్కు తీసుకున్నాడు. 2018 ఫిబ్రవరి 25వ తేదీ అర్ధరాత్రి హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సాక్షాత్తూ సచివాలయం వెనుక రాజధానికి భూమి ఇవ్వని తన పొలంలో రహదారి నిర్మిస్తున్న అధికారులను రైతు గద్దె మీరాప్రసాద్ అడ్డుకున్నాడు. దీంతో రాజధాని పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు రైతును చొక్కా చింపి రోడ్డు మీదకు ఈడ్చేశారు. దీంతో రైతు స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. 2018 జూన్ 28న మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ ఓ హోటల్ మేనేజర్‌పై పాత బకాయిలు చెల్లించాలని కోరితే.. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ నడిరోడ్డుపైనే గుండా మాదిరి దాడికి పాల్పడ్డాడు.
నెక్కల్లులో టీడీపీ నేత ఆలూరి సుధాకర్‌బాబు మహిళను కారుతో తొక్కించేసిన దృశ్యం(ఫైల్)
అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై బరితెగింపు
రాజధాని ప్రాంతంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడం, సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా చేయడం వంటి నీచ రాజకీయాలకు సైతం టీడీపీ నేతలు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం తుళ్లూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గద్దె రాకేష్‌ను రహదారిపై వెళుతున్న సమయంలో కవ్వించి టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. తాజాగా, గురువారం టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు ఆలూరి బ్రహ్మయ్య, సుధాకర్‌బాబు తుళ్లూరు మండలం నెక్కలు గ్రామానికి చెందిన బీసీలను తమపై కేసు పెట్టడానికి వెళ్తారా అంటూ 8 మందిని రాక్షసత్వంగా కారుతో తొక్కించేశారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. సిట్టింగ్ ఎమ్మల్యే శ్రావణ్‌కుమార్ ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వ్యక్తులే ఇటువంటి దాడులకు పాల్పడుతుండడంతో రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎలా బతకాలో తెలియడం లేదని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతగాక.. ప్రతిపక్షంపై నిందలు
ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు దిగజారి విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతాయని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినన్ని అక్రమాలు, హత్యలు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతంగా ఉండే రాజధాని ప్రాంతం టీడీపీ అధికారంలోకి వచ్చాక హింసాత్మకంగా మారింది. తమ అవినీతి, అక్రమాలకు అడ్డొస్తే సామాన్యులను సైతం హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. నెక్కల్లులో జరిగిన దుర్ఘటనలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రధాన అనుచరులే ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
– ఉండవల్లి శ్రీదేవి, వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి
Comments
Please login to add a commentAdd a comment