సాక్షి, చెన్నై: దేశ రాజకీయాలో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనపై మంగళవారం స్టాలిన్ స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే తమ సమావేశం జరిగిందని డీఎంకే చీఫ్ వెల్లడించారు.
కేసీఆర్ తన ఆలోచనలను తనతో పంచుకున్నారని, థర్డ్ ఫ్రంట్ ఆలోచన ప్రస్తుతం తమకు లేదని స్పష్టం చేశారు. తదుపరి నిర్ణయం సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరమే అని తేల్చిచెప్పారు. కాగా కేసీఆర్ తమిళనాడు పర్యటనపై ఆరాష్ట్ర కాంగ్రెస్ శాఖ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. దేశంలో మూడో లేదా ఫెడరల్ ఫ్రంట్‌కో ఆస్కారం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్.అళగిరి వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల తమిళనాడులో జరిగిన 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అలాగే, కాంగ్రెస్‌తో కలసి తమిళనాట తాము ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం తమకు ఉందని, ప్రస్తుతానికి జాతీయ ప్రస్తావన వద్దన్నట్టు స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. చివరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి చర్చించుకుందామన్నట్టుగా ఇద్దరు నేతలు సంకేతాల్ని ఇచ్చుకున్నట్టుగా డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment